సబ్‌జైలు తనిఖీ
గురజాల : స్థానిక సబ్ జైలును ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, న్యాయమూర్తి టి.లీలావతి గురువారం తనిఖీ చేశారు. సబ్‌జైలులో వంటగది, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. న్యాయమూర్తి ఖైదీలతో మాట్లాడారు. కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిని పెట్టుకోలేని వారు ఉంటే అర్జీ పెట్టుకుంటే ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. సకాలంలో ఖైదీలకు భోజనం , వైద్య సేవలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సబ్ కోర్టు న్యాయమూర్తి వై.శ్రీనివాసరావు, న్యాయ సహాయ న్యాయవాది కలివెల ప్రభుదాసు, బార్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరెడ్డి, జైలు సూపరింటెండెంట్ సీహెచ్ సుబ్బారెడ్డి, అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు.
డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): వీధి వ్యాపారులు ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి వినియోగంపై డిజిటల్ అక్షరాస్యత కలిగి ఉండి అవగాహన పెంచుకోవాలని గుంటూరు జిల్లా ఎల్‌డీఎం రత్నమహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పాత గుంటూరులోని యూనియన్ బ్యాంకులో మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వనిధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులు డిజిటల్ లావాదేవీలపై దృష్టి సారించాలన్నారు. అవసరమైన రుణాలను అర్హులైన వీధి వ్యాపారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ విజయలక్ష్మి, మెప్మా సీఓ అహ్మద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
రెవెన్యూ అధికారులను
ఆదేశించిన కలెక్టర్
నరసరావుపేట: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టిసారించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్డీఓ కార్యాలయ సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ఇతర మంత్రుల కార్యాలయాల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వీఆర్వోలు, కింది స్థాయి సిబ్బందికి ఫిర్యాదుల పరిష్కారం విషయంలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించాలని సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారికి సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు, ఇతర అవసరాల నిమిత్తం నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అర్జీదారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని, వారితో సుహృద్భావ వాతావరణంతో మసలుకోవాలన్నారు. ప్రతివారం ప్రజా ఫిర్యాదుల దినం సందర్భంగా వస్తున్న అర్జీలలో 70 నుంచి 80 శాతం భూ, రెవెన్యూ సంబంధించినవే ఉంటున్నాయని చెప్పారు. మండల స్థాయిలోనే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలన్నారు. రీ ఓపెన్ అయ్యే కేసులపై అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత మండల అధికారులు పాల్గొన్నారు.
లారీ ఢీకొని
ఇద్దరు దుర్మరణం
కాకుమాను: ద్విచక్ర వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన దుర్ఘటన పెదనందిపాడు మండలంలోని వరగానిలో గురువారం జరిగింది. ఇన్‌చార్జి ఎస్‌ఐ పృథ్వీ ఏకనాథ్ తెలిపిన వివరాల మేరకు.. వరగాని గ్రామానికి చెందిన తూమాటి శాంసన్ (62), దేవరపల్లి జాన్‌బాబు(14) గ్రామంలోని శ్మశాన వాటికలో కూలీ పనులు ముగించుకుని టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై ఇంటికి వస్తున్నారు. అదే సమయంలో గుంటూరు నుంచి చీరాల వైపు వెళ్తున్న ఏపీ16 ఎక్స్2187 నంబరు కలిగిన లారీ వీరిని ఢీకొంది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తర్వాత డ్రైవరు లారీని ఆపకుండా పారిపోయాడు. చీరాలలో గుర్తించి లారీ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment