కోటప్పకొండ తిరునాళ్లపై సమీక్ష
నరసరావుపేట రూరల్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న మొదటి కోటప్పకొండ తిరునాళ్లను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సూచించారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండలో జరుగనున్న తిరునాళ్ల ఏర్పాట్లపై తొలి సమీక్ష సమావేశం గురువారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఆర్డీఓ మధులత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ఈవో డి.చంద్రశేఖరరావుతోపాటు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ తిరునాళ్లకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ట్రాఫిక్ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. తిరునాళ్ల రోజు మంత్రి నారా లోకేష్ కోటప్పకొండకు వస్తానని మాట ఇచ్చారని వివరించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీఓ మధులత మాట్లాడుతూ తిరునాళ్ల ఏర్పాట్లను ఫిబ్రవరి 21లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. డీఎస్పీ కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ తిరునాళ్లకు 3 వేల మందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కోటప్పకొండ ఈవో చంద్రశేఖరరావు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామి దర్శనం కల్పిస్తామని చెప్పారు. విక్రయానికి 2 లక్షల లడ్డూలు, లక్ష అరిసెలను సిద్ధం చేస్తామని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి 528 బస్సులను నడుపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇంకా పలు శాఖల అధికారులు తమ సన్నద్ధత గురించి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బులియన్ మర్చంట్ అసో సియేషన్ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రవి, కొల్లి బ్రహ్మయ్య, కడియం కోటిసుబ్బారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment