25 వరకు భూ విలువలపై అభ్యర్థనలు తెలపండి
అమరావతి: ప్రభుత్వం భూముల విలువ పెంచే నాటికి జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలలో చిన్నచిన్న పొరపాట్లు, తప్పులు లేకుండా సరిచేయడానికి కృషి చేస్తున్నామని నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ ఎస్. రామ్‌కుమార్ చెప్పారు. గురువారం స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది పనితీరు, అమరావతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో భూముల విలువలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ప్రజలకు సమర్థ సేవలు అందించాలని సూచించారు. రికార్డులు పారదర్శకంగా ఉండాలన్నారు. లింగాపురానికి చెందిన భూమి విలువ రూ.11 లక్షలకు బదులు రూ.96 లక్షలుగా నమోదైందని, దీనిని సరిచేశామని వివరించారు. అలాగే మరికొన్ని ప్రాంతాలలో భూముల విలువ పెంచాలనే అభ్యర్థులు ఉన్నాయని పేర్కొన్నారు. అమరావతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని వడ్డమాను, వైకుంఠపురం, మోతడక, హరిశ్చంద్రపురం, కర్లపూడి, పెదమద్దూరు, ఎండ్రాయి గ్రామాలు సీఆర్డీఏలో కలపడం వల్ల భూముల విలువ పెంచలేదని వివరించారు. ఈనెల 25 వరకు భూముల విలువలపై ఉన్న సమస్యలపై అభ్యర్థనలు తెలియజేయవచ్చని వెల్లడించారు. వీటిపై రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలిసి విచారణ జరిపి సవరణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న భూముల విలువ 2 లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు మాత్రమే ఉందని, వాటి విలువను రూ.4 లక్షల నుంచి రూ.ఐదు లక్షలకు పెంచుతున్నామని పేర్కొన్నారు. మొత్తం మీద భూముల విలువ 10 నుంచి 15 శాతం వరకు పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. సమీక్షలో అమరావతి సబ్‌రిజిస్ట్రార్ వెంకటరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment