‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’పై కేంద్ర బృందం అధ్యయనం
● గుంటూరు మిర్చి యార్డు సందర్శన ● అధికారుల నుంచి వివరాల సేకరణ
కొరిటెపాడు(గుంటూరు): ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’లో భాగంగా గుంటూరు జిల్లా మిర్చి పంటపై ఢిల్లీ పీఎంఓ ఆఫీసులో ఓడీఓఎఫ్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు డాక్టర్ ఇషదీప్, డాక్టర్ దివ్యలు శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగలక్ష్మి, అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవార్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, జిల్లా రైతులు పండించిన కొన్ని మిరప రకాలను వీక్షించారు. ఓడీఓపీ డాక్యుమెంటేషన్‌పై చర్చించారు. కార్యక్రమానికి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ అధ్యక్షత వహించారు. ఆ తర్వాత డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, లాఫారంను సందర్శించారు. మిరప రకాలు, చేపడుతున్న ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు. లాం ఆర్‌ఎస్‌కేని సందర్శించి, డిజిటల్ గ్రీన్ వారు రైతులకు అందిస్తున్న సేవల గురించి వాకబు చేశారు. అనంతరం అంకిరెడ్డిపాలెంలో ఉద్యాన శాఖ ద్వారా రాయితీ పొందిన విశ్వసాయి ఫుడ్స్ అండ్ కోల్డ్‌స్టోరేజీని సందర్శించారు. రైతులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతోంది ? రైతులకు ఏ విధంగా స్టోరేజ్‌లు ఉపయోగపడతున్నాయో ? విఫులంగా తెలుసుకున్నారు. అనంతరం గుంటూరు మిర్చి యార్డు, చుట్టుగుంటలోని స్ప్రైసెస్ బోర్డు కార్యాలయంను సందర్శించి, వారు చేపడుతున్న ప్రాజెక్ట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. మిర్చి యార్డులో విస్తృతంగా పర్యటించారు. సాగులో ఉన్న మిర్చి రకాలు, ధరలు, సీజన్ వ్యవధి, రోజుకు వస్తున్న బస్తాలు, ఏఏ జిల్లాల నుంచి గుంటూరు యార్డుకు మిర్చి వస్తుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్ప్రైసెస్ బోర్డు కార్యాలయంలోని మిరప టెస్టింగ్ ల్యాబ్‌ను సందర్శించారు. మిర్చి పండించే రైతులు, మిర్చి ఎగుమతిదారులకు ల్యాబ్ వల్ల కలిగే ప్రయోజనాలను అధ్యయనం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి బి.రవీంద్రబాబు, యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు, డాక్టర్ రమణ, శారద పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment