కళా పరిషత్ నాటక సంబరాలు ప్రారంభం
నగరంపాలెం: గత 26 ఏళ్లుగా గుంటూరు కళా పరిషత్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు గుంటూరు కళాపరిషత్ అధ్యక్షుడు పి.వి.మల్లిఖార్జునరావు అన్నారు. మూడు రోజులపాటు జరిగే కళాపరిషత్ 27వ వార్షిక నాటకోత్సవాల ప్రారంభ సభ శుక్రవారం రాత్రి మార్కెట్ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఞన మందిరంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సమయ పాలనను కచ్చితంగా పాటిస్తూ, కళా పరిషత్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రముఖ వైద్యులు యెండ్లూరి సీతారామాంజనేయులు మాట్లాడుతూ వాస్తవికమైన కథాంశాలతో సాగుతున్న నాటక రంగాన్ని ప్రేక్షకులు బాగా ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ రంగ స్థల నటుడు వేముల మోహనరావు మాట్లాడుతూ నిబ్ధతతో రాష్ట్రానికే తలమానికంగా కళా పరిషత్ నిర్వహిస్తున్నారని తెలిపారు. కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి బి.పూర్ణ తదితరులు మాట్లాడారు. రచయిత షేక్ సైదా, ప్రజా నాట్యమండలి నాయకులు కొండలరావు దేశభక్తి గీతాలు అలపించారు. తొలుత విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో స్వేచ్ఛ నాటికను ప్రదర్శించారు. పి.ఎస్.నారాయణ మూలకథ అందించగా, పరమాత్ముని శివరామ్ నాటకీకరణ చేయగా, బీఎంరెడ్డి దర్శకత్వం వహించారు. కొలకలూరి వారి జనరల్ బోగీలు నాటిక ప్రదర్శించారు. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి వివరాలు ఉండవని, ప్రమాద వేళల్లో బాధితుల వేదన వర్ణాతీతమని వివరించారు. పి.టి.మాధవ్ నాటికను రచించగా, గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. అనంతరం రుతువు లేని కాలం నాటికతో బంధాల విలువలను తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment