● ఐసీడీఎస్ పీడీ కార్యాలయం ముట్టడి ● బైఠాయించి నినాదాలు
లక్ష్మీపురం: అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించి ఏడాది పైగా అయినా ఇంతవరకు పోస్టులు ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.రేఖ అన్నారు. గత నాలుగు రోజులుగా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు నిరహాదార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు కుమారి అధ్యక్షతన ఐసీడీఎస్ పీడీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు ఖాళీ అయిన పోస్టులను గుర్తించి ఇంటర్వ్యూలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేస్తున్నారన్నారు. గుంటూరు జిల్లా అధికారులు మాత్రం జిల్లాలో నూట పది పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ ఎందుకు భర్తీ చేయట్లేదని ఆమె ప్రశ్నించారు. జిల్లాలో 39 మంది వర్కర్స్, 66 మంది హెల్పర్ పోస్ట్లు ఖాళీగా ఉండటం వల్ల ఆయా సెంటర్లకు వచ్చే పిల్లలు ఏమి నేర్చుకోవాలని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు సక్రమంగా పనిచేయకపోతుంటే, వాటిని మార్చడానికి బదులు అధికారులు మెమోలు ఇచ్చి వేధించటం సరికాదని తెలిపారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వై. నేతాజీ మాట్లాడుతూ అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్తంగా 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, మట్టి ఖర్చులు జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మర్ హాలిడేస్ అంగన్‌వాడీ సెంటర్లకు కూడా వర్తింపజేయాలని కోరారు, మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి దీప్తి మనోజ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, నాయకులు బి. లక్ష్మణరావు, బాబు ప్రసాద్, హుస్సేన్ వలి ప్రసంగించారు.
పండుగ తరువాత సమస్యలు పరిష్కరిస్తాం
ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి ఆందోళనకారుల వద్దకు వచ్చి సమస్యలపై చర్చించారు. పండుగ సెలవుల అనంతరం ఇంటర్వ్యూలో నిర్వహించిన హెల్పర్లందరికీ పోస్టింగులు ఇస్తామన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి యూనియన్ నాయకులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment