వైరల్ ఫీవర్లపై అప్రమత్తత ముఖ్యం
● దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతున్న ప్రజలు ● ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తేనే నివారణ సాధ్యం ● వైద్యులు, సూపర్‌వైజర్లతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి సమీక్ష
సత్తెనపల్లి: శీతాకాలంలో వైరల్ ఫీవర్లతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రవి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సత్తెనపల్లి డివిజన్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చలి తీవ్రత పెరిగి అనేక వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వాతావరణం చల్లగా ఉండటంతో హానికారక వైరస్ శరీరంలోకి ప్రవేశించి వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. ఈ కాలంలో సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఫ్లూ వంటి వ్యాధులు సంభవిస్తాయని పేర్కొన్నారు. వీటితోపాటు పలు రకాల అంటువ్యాధులు, కంటి వ్యాధులే కాకుండా ఎలర్జీలు, ఆస్తమా, సీవోడీపీ, అలర్జిక్ బ్రాంకై టిస్, నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల తీవ్రత పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారానే వీటి నివారణ సాధ్యమవుతుందని చెప్పారు. డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగుపడాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సూపర్‌వైజర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కేంద్రాల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లా డిప్యూటీ వైద్య అధికారి డాక్టర్ పద్మావతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎం.గీతాంజలి, నోడల్ అధికారి డాక్టర్ హనుమకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment