కక్ష సాధింపులకు
పాత కేసుకు కొత్త సెక్షన్లు
● వినుకొండ పోలీసుల అడ్డగోలు పోకడలు ● రెండున్నరేళ్ల కిందటి కేసులో తాజాగా మార్పులు ● రషీద్ హత్యకేసులో నిందితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు ● 22 మంది వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను రిమాండ్‌కు పంపిన వైనం ● రషీద్ హత్యకు గురికాగా.. ఆయన సోదరుడిపైనా కేసు బనాయింపు
సాక్షి, నరసరావుపేట: వినుకొండ టౌన్ పోలీసులు పాత కేసుల్లో కొత్త సెక్షన్లు చేర్చి వైఎస్సార్‌సీపీ నేతలను రిమాండ్‌కు పంపారు. వినుకొండ పట్టణ పరిధిలో 2022 జులై 10వ తేదీన జరిగిన బైకు దహనం కేసులో మంగళవారం 22 మందిని పోలీసులు స్థానిక వినుకొండ జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. కేసు వివరాల్లోకి వెళితే... 2022 జులై 10వ తేదీన ఎస్‌కే షఫీ అనే వ్యక్తిపై జిలానీ అనే యువకుడు బీరు సీసాతో దాడి చేసి గొంతుకోశాడు. దీంతో షఫీ ఆత్మీయులు ఆవేశంతో తమ ఇంటిపై దాడి చేసి బైక్‌ను దహనం చేసినట్టు జిలానీ సోదరుడు జిమ్ జానీ (జానీ బాషా) వినుకొండ టౌన్ పోలీసుస్టేషన్‌లో అదే రోజు ఫిర్యాదు చేశాడు. సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో జిమ్ జానీ తన ఇంటి వద్ద ఉన్న బైక్‌ను తగలబెట్టారని 15 మందిపై అప్పట్లో ప్రైవేట్ కేసు వేయగా.. ఇంకా కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉంది. గొంతు కోసిన ఈ జిలానీ ఎవరో కాదు.. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన వైఎస్సార్ సీపీ కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై హత్య చేసిన కేసులో నిందితుడు. జిమ్ జానీ సైతం తమ బిడ్డ హత్యకేసులో భాగస్వామి అని, వెంటనే అరెస్ట్ చేయాలని రషీద్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినపప్పటికీ పోలీసులు జానీని అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.
రెండున్నరేళ్ల తరువాత ఫిర్యాదు...
రషీద్ మర్డర్ కేసు నుంచి బయటపడటంతోపాటు వైఎస్సార్‌సీపీకి అండగా ఉన్న మైనార్టీలను భయపెట్టాలన్న ఉద్దేశంతో కూటమి నేతల అండదండలతో రషీద్ హత్య కేసు నిందితులు కొత్త ప్లాన్ అమలు చేశారు. ఇందుకు పోలీసుల సహాయం లభించడంతో అక్రమ సెక్షన్లు బనాయింపు చకచకా జరిగిపోయింది. ఇందులో భాగంగా జిమ్ జానీ వేసిన ప్రైవేట్ కేసు పెండింగ్‌లో ఉండగానే.. కొత్తగా రెండున్నరేళ్ల తరువాత మరో ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా గత నెల 29వ తేదీన వినుకొండ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో గతంలో కోర్టులో వేసిన ఫిర్యాదులో జిమ్ జానీ ఇంటి మీదకు వచ్చి బైక్ తగలబెట్టారని రాయగా, కొత్తగా ఇచ్చిన ఫిర్యాదులో ఏకంగా ఇంటినే తగలబెట్టారని మార్చి రాశారు. ఇందులో నిందితులకు బెయిల్ రాకూడదన్న కక్షతో మంగళవారం అప్పటికప్పుడు సెక్షన్లను పెంచి కోర్టులో మెమో దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు గతంలో కోర్టులో వేసిన ఫిర్యాదులో 15 మంది నిందితులు పేర్లు చేర్చగా, తాజా ఫిర్యాదులో ఏకంగా 30 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో హత్యకు గురైన రషీద్ సోదరుడు ఖాదర్ బాషా పేరు సైతం చేర్చడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోద్బలంతోనే దాడి జరిగిందని, పార్టీ మారనందుకే తమ ఇంటిపై దాడి చేశారంటూ కొత్త రాగం తెరపైకి తెచ్చారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టానికి వ్యతిరేకంగా పోలీసులు సెక్షన్లు మార్చడం పట్ల న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కేసు పెండింగ్‌లో ఉండగా రెండున్నరేళ్ల తరువాత వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా కేసు నమోదు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. మైనార్టీలను రాజకీయంగా వైఎస్సార్‌సీపీ వైపు వెళ్లకుండా చేయడంతోపాటు ఎలాగైనా రషీద్ హత్య కేసు నుంచి బయటపడాలన్న కుట్రతోనే ఈ కొత్త కేసులు, సెక్షన్ల మార్పు చేస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ మైనార్టీ నేతలు వాపోతున్నారు.
రెండున్నరేళ్లలో
రెట్టింపైన నిందితులు
Comments
Please login to add a commentAdd a comment