ఎర్రమట్టితో ‘పచ్చ’ దందా!
● అమరావతి మండలం ఎండ్రాయిలో యథేచ్ఛగా మైనింగ్ ● ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న వైనం ● రోజుకు 100 నుంచి 150 లారీలలో తరలింపు ● ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి ● అక్రమార్జనతో జేబులు నింపుకొంటున్న తెలుగు తమ్ముళ్లు
ఎర్ర మట్టి తవ్వకాలతో దోచుకుంటున్న టీడీపీ నేతలు
సాక్షి, నరసరావుపేట: అమరావతి మండల పరిధిలోని ఎండ్రాయి, లేమల్లె గ్రామాలకు చెందిన పేద దళితులు, మైనార్టీలకు సాగు చేసుకోవటానికి ప్రభుత్వం దశాబ్దం క్రితం డీకే పట్టాల రూపంలో భూమిని పంపిణీ చేసింది. లేమల్లె, ఎండ్రాయి గ్రామాల మధ్యలో ఉన్న ఈ పొలాలలో ఉన్న నాణ్యమైన ఎర్రమట్టిని గుర్తించిన టీడీపీ నేతలు వాటిపై కన్నేశారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూములు కలిగిన ఎండ్రాయి, లేమల్లె గ్రామాలకు చెందిన పేద ఎస్సీ, మైనార్టీ రైతులకు డబ్బు ఆశ చూపించి తక్కువ ధరకే లీజుకు తీసుకున్నారు. తొలుత సుమారు 5 ఎకరాలతో మొదలైన గ్రావెల్ తవ్వకాలు క్రమంగా పెంచుకుంటూ నేడు సుమారు ఇరవై ఎకరాలకు చేర్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండదండలతో వారి అనుచరులు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రతిరోజు వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వకాలు చేసి, తరలిస్తున్నారు. నిత్యం 100 నుంచి 150 లారీల ఎర్రమట్టి ఇతర ప్రాంతాలకు వెళ్తోంది.
అడ్డగోలుగా సంపాదిస్తున్న కూటమి నేతలు..
గత ప్రభుత్వ హయాంలో ఓ ప్రైవేట్ సంస్థకు మైనింగ్ వ్యవహారాల పన్ను వసూలును అప్పగించారు. ఆ సంస్థ ఎర్రమట్టికి టన్నుకు రూ.60 చొప్పున లారీకి రూ.1,500 వసూలు చేసింది. 10 చక్రాల లారీ మట్టి కావాలంటే ఆనాడు రూ.1,500 సీనరేజి చెల్లించి, రవాణా ఖర్చులు భరించాలి. కానీ నేడు 10 చక్రాల లారీ మట్టి కావాలంటే క్వారీలోనే రూ.6,000 చెల్లించాల్సి వస్తోంది. గతంలో వసూలు చేసిన రూ.1,500 ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యేది. కాని నేడు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా జమ చేయకుండా ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు చేసి కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయానికి గండిపడుతోంది.
పొంచి ఉన్న ప్రమాదం ...
కూటమి నేతలు ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ సుమారు 30 – 40 అడుగుల లోతున గోతులు తవ్వుతున్నారు. దీంతో ఈ గుంటలలో నీరు ఊరటంతో ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ తిరిగే రైతులు, పిల్లలు, పశువులకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రెండు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అలాగే ప్రతి ఏడాది గుంటూరు శివారులోని గోరంట్ల వద్ద హోసన్నామందిరం వారు లక్షలాది భక్తులతో నిర్వహించే గుడారాల పండుగ ఈ సంవత్సరం ఎర్రమట్టి తవ్వకాలు జరుపుతున్న క్వారీ సమీపంలోని చర్చి వద్ద చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పండుగ ఇక్కడ నిర్వహిస్తే ఈ గుంతల నుంచి భక్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికై నా అక్రమ మైనింగ్‌పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని వాటికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను అక్రమార్కుల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారం చేపట్టిన రోజు నుంచి కూటమి నేతలు పంచ భూతాలను సైతం వదలకుండా దోపిడీ చేస్తున్నారు. అందరి కడుపులు నింపే పంట చేలను సైతం వదలడం లేదు. అమరావతి మండల పరిధిలోని ఎండ్రాయి, లేమల్లె గ్రామల పరిధిలో భూమి లేని నిరుపేదలకు వ్యవసాయం చేసుకొని బతకడానికి ఇచ్చిన అసైన్డ్ భూములను తక్కువ ధరకే టీడీపీ నేతలు లీజుకు తీసుకొని మట్టి తవ్వకాలు జరిపి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోయినా, సీనరేజ్ సుంకం చెల్లించకపోయినా మట్టి తవ్వకాలు ఆపేందుకు అధికారుల చర్యలు శూన్యం. స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు కావటంతో మైనింగ్, రెవెన్యూ అధికారులు
పట్టించుకున్న పాపాన
పోలేదు.
Comments
Please login to add a commentAdd a comment