ప్రాణాంతకరి | - | Sakshi
Sakshi News home page

ప్రాణాంతకరి

Published Sat, Oct 26 2024 12:55 AM | Last Updated on Sat, Oct 26 2024 12:55 AM

ప్రాణ

ప్రాణాంతకరి

ఆంధ్రా–ఒడిశా సరిహద్దును దాటుకుంటూ 2017లో మన్యం ఏజెన్సీలోకి ఏనుగులు ప్రవేశించాయి. అప్పటి నుంచి ఎక్కడికక్కడ దాడులు చేస్తూ జిల్లాలోని గిరిజనుల ప్రాణాలు తీస్తున్నాయి. పంటలు ధ్వంసం చేస్తున్నాయి. కొద్దిరోజుల కిందట కొమరాడ మండలం వన్నాం గ్రామానికి చెందిన వాన శివున్నాయుడు(62) అనే వృద్ధుడిని తొక్కి చంపాయి. గురువారం పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామానికి చెందిన దేవాబత్తుల యాకోబు(74) మీద దాడి చేసి ప్రాణాలు తీశాయి. ఏనుగుల గుంపు ఇక్కడికి వచ్చిన తర్వాతే మరో నాలుగు ఏనుగు పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. సమృద్ధిగా పంటలు, కావాల్సినంత నీరు లభ్యమవుతుండడంతో జిల్లానే తమ శాశ్వత నివాసంగా ఏర్పరచుకున్నట్లు అనిపిస్తోంది. శ్రీకాకుళం వైపు నుంచి జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును ఒడిశా ప్రాంతానికి తరలించినా.. తిరిగి జిల్లాకు చేరుకుని కొమరాడ, పార్వతీపురం, జియ్యమ్మవలస, భామిని, సీతంపేట, గరుగుబిల్లి తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల సంఖ్యను నిర్ధారించేందుకు మూడు రోజులపాటు అటవీ శాఖాధికారులు సర్వే చేపట్టారు. పార్వతీపురం డివిజన్‌ పరిధిలో ఏడు, పాలకొండ డివిజన్‌ పరిధిలో నాలుగు ఏనుగులు తిరుగుతున్నట్లు గుర్తించారు.

దశాబ్దాలుగా వీడని సమస్య

ఏనుగుల సమస్య ఐదారేళ్ల క్రితానిది కాదు. ఒడిశా రాష్ట్రం లఖేరి నుంచి తొలిసారిగా 1998 అక్టోబర్‌ 4న కురుపాం అటవీ ప్రాంతంలోకి ఏనుగులు ప్రవేశించాయి. వాటిని తరిమేసినా.. 1999 ఆగస్టు లో కురుపాం, గుమ్మలక్ష్మీపురం కొండల్లోకి వచ్చా యి. మళ్లీ వాటిని వెనక్కి పంపారు. 2007–08 సంవత్సరాల మధ్య గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, సీతంపేట, వీరఘట్టం ప్రాంతా ల్లో పంటలను తీవ్రంగా నష్టపరిచాయి. ఆ సమయంలో వాటిని తరిమికొట్టేందుకు ‘ఆపరేషన్‌ గజ’ను చేపట్టారు. ఏనుగులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఒడిశా తరలిస్తుండగా రెండు మృతి చెందాయి. దీంతో ఆ ఆపరేషన్‌ను నిలిపివేశారు. అప్పట్లో ఉమ్మడి విజయనగరం– శ్రీకాకుళం జిల్లాల మధ్య ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినా గిరిజనుల వ్యతిరేకత నేపథ్యంలో నిలిచిపోయింది. తర్వాత కొన్ని ప్రాంతాలను జోన్‌ కోసం ప్రతిపాదించినా ఏదీ కార్యరూపం దాల్చలేదు.

గజరాజులకూ ముప్పే..

వన్యప్రాణులను సంరక్షించడం అందరి బాధ్యత. ఆహార అన్వేషణ కోసం అరణ్యాన్ని వదిలి, గ్రామాల్లోకి వస్తున్న ఏనుగులూ ప్రమాదవశాత్తు మృతి చెందడం ఆందోళన కలిగించే విషయమే. ఇప్పటి వరకు ఏడుకు పైగా గజరాజులు మృతి చెందాయి. గత జూన్‌ నెలలో గరుగుబిల్లి మండలం తోటపల్లి సరిహద్దుల్లో అనారోగ్యంతో ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. 2018 సెప్టెంబర్‌ నెలలో ఆర్తాం వద్ద విద్యుదాఘాతానికి గురై ఒక ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత దుగ్గి సమీపంలోని నాగావళి ఊబిలో కూరుకుపోయి మరొకటి మృత్యువాతపడింది. అంతకుముందు 2010 నవంబర్‌లో అప్పటి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం (ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా) మండలం కుంబిడి ఇచ్ఛాపురంలో రెండు కరిరాజులు మృతి చెందాయి. కొన్నాళ్ల క్రితం ‘హరి’ అనే మగ ఏనుగు గుంపు నుంచి తప్పిపోయింది. నెలలు గడిచినా దాని జాడ తెలియరాలేదు. గుంపులో కలవలేదు. గతేడాది మే నెలలో జిల్లాలోని భామిని మండలం కాట్రగడ–బి వద్ద విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. విద్యుదాఘాతాలకు, రైతులు పంటల కోసం ఏర్పాటు చేసుకున్న రక్షణ కంచెల వల్ల, ప్రమాదవశాత్తు గజరాజులూ ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఏళ్లుగా అటు అమాయక గిరిజనులతోపాటు.. ఇటు ఏనుగుల ప్రాణాలూ పోతున్నా ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు.

కుంకీలను పంపిస్తారా?

చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కరిరాజుల వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కర్ణాటక నుంచి కుంకీలను తీసుకువచ్చేందుకు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా జిల్లాకూ కుంకీలను పంపుతామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు. కుంకీలు పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఇవి వస్తే ఇక్కడున్న ఏనుగులతో సహవాసం చేసి, వాటిని తమకు అనుకూలంగా మలుచుకుంటాయి. జనారణ్యంలో తిరుగుతున్న గజరాజులను తిరిగి అరణ్యంలోకి వెళ్లేలా దిశానిర్దేశం చేస్తాయి. ఇదే సమయంలో కుంకీలను తీసుకువచ్చేందుకు జిల్లాలో అనువైన పరిస్థితులు లేవని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున నిధులతోపాటు.. కొన్ని నెలల సమయం కూడా పడుతుందని అంటున్నారు. శిక్షణ పొందిన ఏనుగులను ఉంచేందుకు క్యాంపు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కుంకీల రాకకు ఇంకెన్నాళ్లు పడుతుందోనని గిరిజన, ప్రజా సంఘాల నాయకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు గజరాజుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు..

ఏనుగుల దాడిలో జిల్లాలో ఇప్పటి వరకు 13 మంది వరకు మృతి చెందారు.

2019లో ఎన్‌.పకీరు(కొమరాడ), కాశిన్నదొర(జియ్యమ్మవలస)

2020లో వై.నారాయణరావు, ఆర్‌.లక్ష్మునాయుడు(కొమరాడ), జి.అమ్మడమ్మ(జియ్యమ్మవలస)

2021లో ఎ.అప్పమ్మ(కొమరాడ)

2022లో ఎన్‌.రాజాబాబు(అటవీ శాఖ ట్రాకర్‌), డి.గోవింద్‌(కొమరాడ)

2023లో ఎ.దాసనాయుడు(బలిజిపేట)

2024లో వి.శివున్నాయుడు(కొమరాడ), డి.యాకోబు(పార్వతీపురం మండలం)

గతంలో భామిని మండలంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఏనుగుల దాడిలో మృతుని కుటుంబానికి 10 లక్షల పరిహారం

పార్వతీపురంటౌన్‌: ఏనుగుల దాడిలో పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి గ్రామానికి చెందిన యాకోబ్‌ గురువారం మృతిచెందారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే విజయ్‌ చంద్ర, జిల్లా అటవీశాఖాధికారి ప్రసూన కలిసి శుక్రవారం అందజేశారు. వృద్ధుడు యాకోబ్‌ మృతి చెందడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, అటవీశాఖ అధికారులు స్పందించి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారని ఎమ్మెల్యే వివరించారు. ఎవరూ ఏనుగుల ఫొటోలు, వీడియోలు తీయొద్దని, వన్యప్రాణుల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏలికలు మాటలు కోటలు దాటుతున్నా.. గజరాజులు మాత్రం మన్యం గడప దాటడం లేదు. జిల్లాను వీడని కరిరాజులు.. వరుసగా మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 13 మందిని పొట్టనబెట్టుకున్నాయి. రూ.6 కోట్ల మేర పంటలకు, ఆస్తులకు నష్టం కలిగించాయి. ప్రస్తుతం జిల్లాలో రెండు గుంపులుగా ఇవి సంచరిస్తున్నాయి. అటు గిరిజన ప్రజలనే కాక.. ఇటు పార్వతీపురం, సీతానగరం మండల వాసులనూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిత్యం బిక్కుబిక్కుమంటూ, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

– సాక్షి, పార్వతీపురం మన్యం

ఏనుగుల సమస్యకు పరిష్కారమెలా?

ఇప్పటికే 13 మందిని పొట్టనబెట్టుకున్న గజరాజులు

రెండు గుంపులుగా సంచారం

నిత్యం భయంభయంగానే గిరిజనం

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రాణాంతకరి 1
1/2

ప్రాణాంతకరి

ప్రాణాంతకరి 2
2/2

ప్రాణాంతకరి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement