ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల నిరసన
సీతంపేట: జిల్లాలోని గిరిజన గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు శాంతియుత నిరసన బాట పట్టారు. అందులో భాగంగా గడిచిన నాలుగు రోజులుగా దశలవారీగా వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సమ్మె నోటీసులు ఇచ్చి బయటకు వస్తున్నారు.వారిలో కొంతమంది అమరావతిలోని ధర్నాచౌక్ వద్ద నిరసనలు తెలియజేయడానికి వెళ్లగా మరికొందరు ఐటీడీఏల వద్ద రిలే దీక్షలు చేసి నిరసనలు తెలియజేయడానికి సమాయత్తమవుతున్నారు. బుధవారం నుంచి నిసన ఉద్ధృతం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1633 మంది టీచింగ్ స్టాఫ్ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. జిల్లాలో 8 గురుకుల పాఠశాలలు, మరో 4 కళాశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 120 మంది పనిచేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో వారంతా నెట్టుకొస్తున్నారు. ఈ తరుణంలో మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులు కలపనున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో తాము వీధిన పడతామని ఆవేదన చెందుతున్నారు. తక్షణం తమను క్రమబద్ధీకరిచాలని, కనీసం కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్‌టీ)గా గుర్తించాలని, సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేస్తూ 2022 పీఆర్‌సీ ప్రకారం తక్షణమే జీతాలు పెంచాలని కోరుతున్నారు. 2024 డీఎస్సీలో గురుకులంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ పోస్టులను మినహాయించాలనే డిమాండ్‌తో నిరసన దీక్షలు చేపట్టనున్నారు.
ప్రిన్సిపాల్స్‌కు సమ్మెనోటీసులు అందజేత
సీఆర్‌టీగా మార్చాలని, జీతాలు పెంచాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment