కరీంనగర్: త్వరలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో బీఆర్‌ఎస్ తొలివిడత జాబితా ప్రకటించనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గులాబీ పార్టీలో అసమ్మతి రాగం పెరుగుతోంది. నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణలు, పనితీరు, బలబలాలు తదితర అంశాలు బేరిజు వేసుకున్న పార్టీ అధినేత.. అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించే అవకాశం ఉందన్న సంకేతాలతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది.
దీంతో అసమ్మతి నేతలు ఇదే అదనుగా వారికి టికెట్ కేటాయించొద్దంటూ ప్రకటనలు విడుదల చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జిల్లాలోని రామగుండంలో అసమ్మతి సెగ రగలగా.. అది పెద్దపల్లికి.. తాజాగా మంథనికి చేరుకుంది. దీంతో కారులో సీటు ఎవరికి దక్కనుందోననేది హాట్‌టాపిక్‌గా మారింది.
ఆత్మగౌరవం పేరుతో..
పెద్దపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని.. ఇస్తే తెలంగాణ భవన్ ముందు ధర్నా చేస్తానని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజయ్య ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, రాజయ్య, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సుమారు 500మంది పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీ మారారు.
స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, ఆత్మగౌరవం లేనిచోట ఉండలేమంటూ వారందరూ కండువా మార్చుకున్నారు. మరికొందరు సైతం పార్టీ మారేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తి కలిగిస్తున్నాయి. బీసీవాదంతో జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, నల్లా మనోహర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీరి అడుగులతో నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల మాదిరి అసమ్మతి సెగ అంటుకుంటుందో..? లేదో..? కొద్దిరోజుల్లో తేలనుంది.
‘కోరుకంటి’కి మాత్రం టికెట్ ఇవ్వొద్దు..
జిల్లాలో మొదట రామగుండం నియోజకవర్గంలోని పలువురు ఆశావహులు రహస్యంగా సమావేశమై ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని ప్రకటించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏకంగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకపోతామంటూ ప్రజా ఆశీర్వాదయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించారు.
ఆ పంచాయితీ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. కేటీఆర్ వారిని రాజధాని హైదరాబాద్‌కు పిలిపించుకుని పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించొద్దని, రామగుండంకు ఇన్‌చార్జిగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించామని తెలిపారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అందరూ భావించారు. అయితే ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆశావహులను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి.
మంత్రి కొప్పుల తన నివాసంలో అసమ్మతి నేతలతో భేటికాగా.. ఎమ్మెల్యే చందర్ వారిని అక్కడే కలిశారు. ఈ క్రమంలో నేతలందరూ కలిసిపోయారంటూ కోరుకంటి వర్గం సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకుంది. దీనిపై సదరు నాయకులు మాత్రం తాము ఎమ్మెల్యేను కలవలేదని, మంత్రిని కలవడానికి వెళ్లగా.. ఎమ్మెల్యే ఆకస్మికంగా అక్కడికి వచ్చారని వివరణ ఇచ్చుకున్నారు.
కేసీఆర్ ప్రకటించే జాబితాను బట్టి భవిష్యత్ కార్యాచరణ చేయాలని ఇటీవల మరోమారు సమావేశమై చర్చించుకున్నారు. తాజాగా ముత్తారంలో సుమా రు 150మంది స్థానిక ప్రజాప్రతినిధులు మంథని నుంచి ప్రస్తుత జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ ప్రెస్‌మీట్ పెట్టడం.. త్వరలో నియోజకవర్గంలో పుట్ట మధుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపడతామని ప్రకటించడంతో గులా బీలో అసమ్మతి ఏ స్థాయికి చేరుతుందోనని బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సార్ ‘మదిలో’ ఎవరు..?
‘క్షేత్రస్థాయిలో బాగా పనిచేయాలె.. వచ్చే ఎన్నికల్లో కూడా మనమే గెలుస్తం. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలే మళ్లీ పోటీ చేస్తరు..’ ఇది గతంలో బీఆర్‌ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ అన్న మాటలు. ఈ ప్రకటన ఎమ్మెల్యేలకు ఊరటనివ్వగా.. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని, వెనకబడినవారికి చెప్పి చూస్తామని, మారకపోతే వారి ఖర్మ.. తీసి పక్కకు పడేస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు ఆశావహులకు ఊరటనిస్తున్నాయి.
ఇలా కేసీఆర్ గతంలో చేసిన ప్రకటనలు, సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ఎవరికి వారే తమకే టికెట్ అంటూ నియోజకవర్గాల్లో హల్‌చల్ చేస్తున్నారు. మరికొందరు ఏకంగా బహిరంగంగా శ్రీవారికి తప్ప టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీని గెలిపించుకుంటామంటూ ప్రెస్‌మీట్‌లు పెట్టి మరి చెబుతుండటం ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఐతే సిట్టింగ్‌లలో ఎవరిని మారుస్తారు..? ఎవరికి అవకాశం కల్పిస్తారు..? అసలు పెద్దసారు మదిలో ఎవరు ఉన్నారు..? అనేదానిపై తీవ్ర చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment