● వారం వ్యవధిలోనే ఏసీబీ వలలో ముగ్గురు అధికారులు ● పట్టు
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలోని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారం ఎత్తుతున్నారు. లంచాల రూపంలో అభాగ్యులను జలగల్లా పీల్చిపిప్పిచేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు బల్లకింద చెయ్యి పెడుతున్నారు. చెయ్యి తడిపితేనే బిల్లులు క్లియర్ చేస్తున్నారు. లేదంటే తిరకాసు పెడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే జిల్లాలోని ఇద్దరు అధికారులు ఏసీబీ వలకు చిక్కడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
లంచం ఇవ్వడమూ నేరమే..
అవినీతి నిర్మూలన ప్రతీఒక్కరి బాధ్యత. లంచం తీసుకోవడం ఎంత నేరమో, ఇవ్వడం కూడా అంతే నేరం. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు సుమారు 70 వరకు ఉండగా, వీటిలో ప్రధానంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రవాణా, పోలీసు, మున్సిపల్, పౌర సరఫరాలు తదితర శాఖల్లో అవినితి పెచ్చుమీరు తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందిపై ఆధారపడకుండా.. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేయాలి. ఇలాచేస్తే లంచాలు ఇవ్వకుండా అధికారులను ప్రశ్నించి పనులు చేయించుకునే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. చట్టప్రకారం చేయాల్సిన పనులకు ప్రభుత్వ శాఖల్లో ఎవరూ లంచం డిమాండ్ చేసినా టోల్ ఫ్రీనంబర్ 1064కు ఫోన్‌చేసి ఫిర్యాదు ఇవొవ్వచ్చు. లేదా నేరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు.
నిక్కచ్చిగా పనిచేసేవారెందరో..
ప్రభుత్వ శాఖల్లోని కొందరు అధికారులు పైసా ఆశించకుండా నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తున్నారనే ప్రశంసలు అందుకుంటున్నారు. కానీ, కొందరు అవినీతితో పెనవేసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సాంకేతికతతో..
మారుతున్న కాలానికి అనుగుణంగా అధికారులు లంచాలు తీసుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. ప్రతీ పనికి రేట్ కట్టి నేరుగా కాకుండా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా వసూలు చేస్తున్నారు. మరికొందరు అమెజాన్, ఫ్లిప్‌కార్డ్‌లో తమకు కావాల్సిన వస్తువులను బుక్ చేసుకుని, వాటికి చెల్లింపులు చేయిస్తున్నారు.
అవినీతి జలగలు
Comments
Please login to add a commentAdd a comment