సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతులకు శాశ్వతంగా ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. వ్యవసాయ రంగంలో దేశ వృద్ధిరేటు 4.8 శాతంగా ఉంటే రాష్ట్ర వృద్ధిరేటు 9.3 శాతమని గుర్తుచేశారు. ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని.. సీఎం జగన్ చర్యలతో ఇది సాధ్యమైందని నీతి ఆయోగ్, ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్) శాస్త్రవేత్తలు, ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారని గుర్తుచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై చంద్రబాబు, లోకేశ్ ట్వీట్లలో చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2004లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేసిన చంద్రబాబు.. 2014లో వ్యవసాయ రుణాలను మాఫీచేస్తానని హామీ ఇచ్చి, చేయకుండా రైతులను వంచించారని దుయ్యబట్టారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు రైతులకు ఒక్కటంటే ఒక్క ప్రయోజనమైనా చేకూర్చారా? అని ప్రశ్నించారు.
రైతుల ఖాతాల్లో రూ.90 వేల కోట్ల జమ
పీఎం కిసాన్–వైఎస్సార్ రైతుభరోసా, బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో రెండున్నరేళ్లలోనే రూ.90 వేల కోట్లను సీఎం వైఎస్ జగన్ రైతుల ఖాతాల్లో జమచేశారని మంత్రి చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ సర్కార్ రైతుల నుంచి రూ.43 వేల కోట్ల విలువైన 2.81 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే.. వైఎస్సార్‌సీపీ సర్కార్ రెండున్నరేళ్లలోనే రూ.32,821 కోట్ల విలువైన 1.78 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. మొక్కజొన్న, జొన్న, పత్తి, కూరగాయలు, బత్తాయి, మామిడి వంటి పండ్లను రూ.6,434 కోట్లతో కొనుగోలు చేసి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించామని చెప్పారు. అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తామని లోకేశ్ హెచ్చరిస్తున్నారని.. కక్షపూరిత రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గుర్తించాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు.
అశోక్‌గజపతి స్థాయికి తగ్గట్లుగా లేరు
ఇక విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయ శంకుస్థాపనలో ప్రొటోకాల్ పాటించామని.. కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించలేదని.. శంకుస్థాపన శిలాఫలకాన్ని ఎత్తిపడేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. అశోక్‌గజపతిరాజు తానే దాడిచేసి.. తనపై దాడి చేసినట్లు చిత్రీకరించుకుని.. అది హిందూ మతంపై చేసిన దాడిగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి.. అదే నిజమని నమ్మించే పాత సిద్ధాంతాన్ని ఎంతకాలం అమలుచేస్తారని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ల ధరలను తగ్గించి.. రాష్ట్రంలో ప్రేక్షకులను అవమానించారని సినీ నటుడు నాని చేసిన వ్యాఖ్యలకు అర్థమేమిటో ఆయనే చెప్పాలని మీడియా ప్రశ్నకు సమాధానంగా మంత్రి కన్నబాబు చెప్పారు. ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని.. అదే బాధ్యతను నిర్వర్తిస్తుంటే ఎందుకంత బాధ అని ప్రశ్నించారు.
‘మిర్చి’ చీడపీడల అధ్యయనానికి కమిటీ
రాష్ట్రంలో మిర్చికి సోకిన చీడ, పీడల నివారణ నిమిత్తం శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేస్తామని కన్నబాబు వెల్లడించారు. నల్ల తామర పురుగు, జెమిని వైరస్ తెగుళ్లతో ఇటీవల రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మిర్చి పంటకు జరిగిన నష్టం, నివారణ చర్యలపై ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 5.11 లక్షల ఎకరాల్లో మిరప సాగవగా.. వైరస్, పురుగుల ప్రభావంతో జరిగిన నష్ట తీవ్రతను తగ్గించేందుకు ఈ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇటీవల దెబ్బతిన్న మిర్చి పొలాలను పరిశీలించామని గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment