వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా
అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు తోడుగా నిలుస్తాం.. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తు పెట్టుకోండి
వాళ్లే కొడుతున్నారు.. వాళ్లే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు
రేపు అలాంటి వాళ్లందరినీ చట్టం ముందు కచ్చితంగా నిలబెడతాం
ఆరు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత
విద్య, వైద్యం, వ్యవసాయం, పాలన బాధ్యత నుంచి తప్పుకున్న సర్కారు
ఎన్నికల హామీలన్నీ గాలికి..
సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు
గతంలో మనం ఇచ్చిన పథకాలనూ రద్దు చేశారు.. చేస్తున్న దల్లా స్కామ్‌లే స్కామ్‌లు.. బాదుడే బాదుడు
బాబు మోసాల గురించి ఆరోజే చెప్పాను
రాజకీయాల్లో వ్యక్తిత్వం, విలువలు ముఖ్యం.. అందుకే అబద్ధాలు చెప్పలేదు
ప్రజలకు అండగా నిలవాల్సిన సమయమిది.. సోషల్ మీడియా ద్వారా బాబును నిలదీద్దాం
చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.72 లక్షల కోట్లు ఇవ్వాలి అని ఆ రోజే చెప్పాను. ఇది అయ్యే పని కాదని, ఆయన చెప్పినవన్నీ మోసాలు, అబద్ధాలు అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపడమే అని, పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పాను. ఇవాళ ఆ వీడియోలు చూస్తే.. జగన్ కరెక్టుగా చెప్పాడనుకునే పరిస్థితి కనిపిస్తోంది.
చంద్రబాబుకూ, జగన్‌కూ మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. మన ప్రభుత్వంలో ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్ డెలివరీ జరిగేది. మరి ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదు? తేడా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది.
ఇవాళ మనం కేవలం చంద్రబాబుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీృ5 లాంటి చెడిపోయి ఉన్న మీడియాతోనూ యుద్ధం చేస్తున్నాం. వీరిని ఎదుర్కోవాలంటే.. సోషల్ మీడియా ద్వారానే సాధ్యం. మన దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కమిటీ సభ్యుడు కూడా సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. ఫోన్ ఒక ఆయుధం కావాలి.
ప్రతి ఒక్కరికీ వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్, యూట్యూబ్ అకౌంట్ ఉండాలి. ప్రతి గ్రామంలో ప్రతి కమిటీ సభ్యుడు ఆ గ్రామంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టాలి. ఇలా వైఎస్సార్సీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. - వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇంత వరకు ఒకలా చూశామని, ఇకపై మరోలా చూస్తామని.. గొప్పగా చూస్తామని చెప్పారు. ఈ విషయంలో మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉందన్నారు. ‘అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తు పెట్టుకోండి. వారిని చట్టం ముందు కచ్చితంగా నిలబెడతాం.
ఎందుకంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. వాళ్లే కొడుతున్నారు.. మళ్లీ వాళ్లే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఒక మనిషిని పది చోట్ల తిప్పుతున్నారు. ఇవన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నాయి’ అంటూ ఎత్తిచూపారు. కచ్చితంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఆరు నెలలకే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత..
కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు. కానీ కేవలం ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ప్రతి ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోంది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను 8 నెలల్లో పూర్తిగా గాలికొదిలేశారు. గతంలో మనం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. అవేవీ అమలు కావడం లేదు.
కూటమి నేతలు ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్లి.. చిన్న పిల్లల దగ్గర నుంచి నీకు రూ.15 వేలు అని మొదలు పెట్టి.. అదే ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లులు బయటకు వస్తే నీకు రూ.18 వేలు, ఆ తల్లుల అత్తలు, పెద్దమ్మలు బయటకు వస్తే నీకు రూ.48 వేలు, అదే ఇంట్లో నుంచి 20 ఏళ్ల పిల్లాడు బయటకు వస్తే నీకు రూ.36 వేలు అని, రైతు కండువా వేసుకుని వస్తే నీకు రూ.20 వేలు అని అందరికీ హామీలు ఇస్తూ వచ్చారు. తీరా గద్దెనెక్కాక మాట తప్పారు.
మాట అమలు కాకపోతే నాయకుడి విలువ పోతుంది
మన వాళ్లు చాలా మంది శ్రేయోభిలాషులు వచ్చి.. చంద్రబాబులా హామీలు ఇవ్వాలని నాతో చెప్పారు. మనం కుటుంబమంతటికీ మంచి చేశాం.. వాళ్లు కుటుంబంలో ప్రతి మనిషికి ఇలా చెప్పు కుంటూ వస్తున్నారు. మనం కూడా చెబుదా మన్నారు. కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్ప లేదు. కారణం రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలి. అలాంటి వారికే విలువ ఉంటుంది. ఒక నాయకుడిగా మనం ఒక మాట చెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు. ఆ మాట నిబెట్టుకున్నామా? లేదా? అని చూస్తారు.
ఆ మాట అమలు కాకపోతే.. ఆ నాయకుడి విలువ పోతుంది. అందుకనే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ఎన్నికల సమయంలో మన మేనిఫెస్టో సందర్భంగా ఇవీ మన పథకాలు అని ప్రజంటేషన్ ఇచ్చాను. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోను మనం అమలు చేశాం. తొలిసారిగా మేనిఫెస్టో అన్న పదానికి కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే అర్థం చెప్పాం.
దేశంలో ఎప్పుడూ జరగని విధంగా బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడే సంక్షేమ కేలండర్ కూడా విడుదల చేస్తూ.. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో ముందే చెప్పాం. ఆ మేరకు ఆ నెలలోనే ఆ పథకాన్ని తూచా తప్పకుండా బటన్ నొక్కి అమలు చేశాం. తద్వారా అక్క చెల్లెమ్మల మొహాల్లో సంతోషం చూడాలని వైఎ స్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే తాపత్రయపడింది.
చంద్రబాబు మోసాలపై ఆ రోజే చెప్పాను
చంద్రబాబు చెప్పినవన్నీ మోసాలు, అబద్ధాలు అని నేను ఆరోజే చెప్పాను. ఇవాళ ఆ వీడియోలు చూస్తే.. జగన్ కరెక్టుగానే చెప్పాడనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి నెలా ఏదో పథకం ద్వారా ప్రజలకు మేలు చేశాం. జగన్ ఉన్నప్పుడు పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పి పెట్టలేదు. ఇప్పుడు జగన్ పెడుతున్న పలావూ పోయింది.. చంద్రబాబు పెడతానన్న బిర్యానీ పోయింది. చంద్రబాబుకూ, జగన్‌కూ మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు.
మన ప్రభుత్వంలో ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్ డెలివరీ జరిగేది. మరి ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదు? తేడా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. చంద్రబాబు చెప్పిన హామీలన్నీ గాలికెగిరిపోయాయి. ఎనిమిది నెలలు అయింది.. సంక్రాంతి వచ్చింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే.. ప్రతినెలా ఏదో పథకం వచ్చేదని ఇవాళ ప్రతి ఇంట్లో ఒక్కటే చర్చ.
విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన గాలికి..
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని నెలకు రూ.కోట్లతో.. 1000 ప్రొసీజర్లను 3,300 వరకు పెంచి గొప్పగా అమలు చేశాం. ఆరోగ్య ఆసరా కూడా అమలు చేశాం. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలోనే ఏకంగా రూ.3 వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారు. పేద వాడు ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి. నెట్వర్క్ ఆస్ప త్రుల్లో ఉచితంగా వైద్యం అందుకునే పరిస్థితి ఎక్క డా లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరి పోయింది.
ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఈ–క్రాప్ అసలు కనిపించడం లేదు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇస్తానన్న రూ.20 వేలు ఇవ్వలేదు. వాస్తవానికి విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన.. ఈ నాలుగు రంగాలను చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత. కానీ ఈ నాలుగు రంగాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అన్నీ గాలికెగిరిపోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది.
పథకాలన్నింటికీ మంగళం
ఐదేళ్లు ప్రతి సంవత్సరం, ప్రతి నెలా షెడ్యూల్ ఇచ్చి పథకాలు అమలు చేసి చూపించాం. ఇప్పుడు ఆ పథకాలన్నింటినీ కూటమి ప్రభు త్వం రద్దు చేసింది. కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఇవి ఇప్పుడు జరగడం లేదు. ఇవాళ మన పార్టీలో ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా వెళ్లగలడు. కారణం మనం చెప్పినవి చేసి చూపించాం. వీళ్ల మాది రిగా మనం అబద్ధాలు చెప్పలేదు, మోసాలు చేయలేదు. వీళ్ల మాదిరిగా అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి మనం సిద్ధంగా లేము.
ఎనిమిది నెలలు అయింది.. ఇప్పుడు కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరు. వారికి ఆ ధైర్యం కూడా లేదు. వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లాడు దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఇస్తామన్న రూ.15 వేలు ఏమైందని చిన్న పిల్లలు, రూ.18 వేలు ఏమైందని తల్లులు, మా రూ.48 వేలు ఏమైందని ఆ తల్లుల అత్తలు, పెద్ద మ్మలు, మా రూ.20 వేలు ఏమైందని రైతులు, మా రూ.36 వేలు ఏమైందని యువత ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండడంతో కూటమి నేతలు ప్రజల మధ్యకు పోలేని పరిస్థితి నెలకొంది.
బాదుడే బాదుడు
ఇవాళ రాష్ట్రంలో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ఆరు నెలలు తిరక్కముందే రూ.15 వేల కోట్ల కరెంటు చార్జీలు భారీగా పెంచారు. రాబోయే రోజుల్లో గ్రామీణ రోడ్లలో టోల్గేట్లు పెట్టి టోల్ వసూలు చేసే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నాడు. రిజిస్ట్రేషన్ ఫీజులు స్థలాల మీదనే కాకుండా పాత ఇళ్ల మీద కూడా వేస్తున్నారు. ఇలా ఏం తీసుకున్నా బాదుడే.
చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించడం లేదు. మన హయాంలో ప్రతి మూడు నెలలకొకసారి.. ఏ పిల్లాడి చదువు ఆగిపోకుండా అడుగులు వేశాం. ఇవాళ జనవరి, పిబ్రవరి, మార్చి త్రైమాసికం నుంచి నాలుగు క్వార్టర్స్‌కు సంబంధించిన ఫీజులు రూ.2,800 కోట్లు బకాయిలు పెట్టారు. వసతి దీవెనతో కలుపుకుంటే మొత్తంగా రూ.3,900 కోట్లు బకాయిలున్నాయి. పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి.
ఇది ప్రజలకు తోడుగా నిలవాల్సిన సమయం
ఇంటి వద్దకే డోర్ డెలివరీ పరిపాలన నుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు తిరగాల్సిన పాలన సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అందుకే వారికి అండగా నిలబడే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రజల సమస్యలను పట్టించుకుని, వారికి తోడుగా ఉన్న వారే నాయకులుగా ఎదుగుతారు. నాయకులంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసింది. చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన వల్ల మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రతి గ్రామంలో పార్టీ నిర్మాణం ఉంది. దీన్ని వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలి. ఈ సంక్రాంతి నాటికి పార్టీ జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల ఏర్పాట్లన్నీ పూర్తి కావాలి. నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తాను. అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి వారంలో మూడు రోజులు.. మంగళ, బుధ, గురువారాల్లో ఒక పార్లమెంటు నియోజకవర్గంలో విడిది చేస్తాను. ప్రతి రోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను.
మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ బలోపేతం కావాలి. గ్రామ స్థాయి కమిటీలు, బూత్ కమిటీలు కూడా బలోపేతం కావాలి. సోషల్ మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలి. మీరు, నేను అందరం చర్చించి ఆ దిశగా అడుగులు వేద్దాం. ప్రతి గ్రామంలో అన్యాయాలను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టాలి.
పిల్లవాడికివ్వాల్సిన రూ.15 వేలు ఏమయ్యాయని ప్రశ్నించాలి. సూపర్ సిక్స్ ఏమైందని ప్రశ్నించాలి. తొలగిస్తున్న పెన్షన్ల మీద కూడా ప్రశ్నించాలి. ఇలా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలి. అన్యాయాలు, అక్రమాలపై నిలదీయాలి. ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలి.
మూడు లక్షల పెన్షన్ల తొలగింపు
ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే నాటికి మన హయాంలో 66,34,742 పెన్షన్లు ఉంటే, ఇవాళ చంద్రబాబు వచ్చిన తర్వాత డిసెంబరు నాటికి ఆ సంఖ్య 62.81 లక్షలకు తగ్గిపోయింది. అంటే 3.53 లక్షల పెన్షన్లు తగ్గించారు. ఇవి కాక ఇక దివ్యాంగుల మీద కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు. వీరి మీద చంద్రబాబు కమిటీ వేసి.. వాళ్ల పెన్షన్లు తగ్గించే కార్యక్రమం మొదలు పెట్టారు.
అంటే ఈ మార్చి నాటికి మరో 3 లక్షల పెన్షన్లు తగ్గించడమే వారి ఉద్దేశం. ఇలా పెన్షన్లు, ఊర్లో ఉన్న ఆస్పత్రులు, కాలేజీలు అన్నింటి మీదా గ్రామంలో ఉన్న కార్యకర్త నుంచి నియోజకవర్గంలో ఉన్న నాయకుడు వరకు ప్రతి సమస్య మీద నిలదీయాలి. రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా అడుగులు వేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి.
జగనన్న ఉండి ఉంటే..
జనవరి చివరి దఫా రైతు భరోసా, చిరు వ్యాపారులకు జగనన్న తోడు, సంక్రాంతి సమయానికి అక్కచెల్లెమ్మలకు ఆసరా డబ్బులు
ఫిబ్రవరి
విద్యా దీవెన, జగనన్న చేదోడు
ఏప్రిల్
వసతి దీవెన, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ
మే
జగనన్న విద్యా దీవెన, రైతులకు ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకారులకు మత్సకార భరోసా, డీజిల్ మీద సబ్సిడీ కార్యక్రమం
జూన్
అమ్మఒడి
జూలై
వాహనమిత్ర, కాపు నేస్తం,
చిరు వ్యాపారులకు జగనన్న తోడు
ఆగస్టు
జగనన్న విద్యా దీవెన, నేతన్న నేస్తం
సెప్టెంబర్
వైఎస్సార్ చేయూత
అక్టోబర్
వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత
నవంబర్
నవంబర్‌లో జగనన్న విద్యా దీవెన, రైతులకు సున్నా వడ్డీ డబ్బులు
డిసెంబర్
ఈబీసీ నేస్తం, లా నేస్తం, ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలకు ట్యాబుల పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment