రఘురామకు వెన్నుపోటా? టికెట్టా? | AP Politics: TDP Ticket Or Chandrababu Betrayal to Raghu Rama | Sakshi
Sakshi News home page

వీరవిధేయుడు రఘురామకు వెన్నుపోటా? టికెట్టా?

Published Fri, Apr 5 2024 2:30 PM | Last Updated on Fri, Apr 5 2024 2:30 PM

AP Politics: TDP Ticket Or Chandrababu Betrayal to Raghu Rama - Sakshi

పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయడి పేరు చెబితే..  ఏపీ ప్రజలకు ఏ ఒక్క మంచి గుర్తుకు రాదు. ఎందుకంటే చేసింది ఏం లేదు కాబట్టి. రాజకీయ భిక్ష పెట్టి.. పిల్లనిచ్చిన మామ నందమూరి తారక రామారావుకే తన వెన్నుపోటు రాజకీయం రుచి చూపించారాయన. అప్పటి నుంచి తన ఫార్టీ ఇయర్స్‌ కెరీర్‌లో ఎందరినో బురిడీలను చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతూ వచ్చారు.  అలాంటి వ్యక్తిని రఘురామ కృష్ణంరాజు నమ్ముకోవడం గురించే ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 

రఘురామ కృష్ణంరాజు.. ఐదేళ్ల కిందట నరసాపురం ఎంపీగా గెలిచింది వైఎస్సార్‌సీపీ పార్టీ తరఫున. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రేజ్‌.. వైఎస్సార్‌సీపీ ‘ఫ్యాన్‌’ హవాలో రఘురామ గెలిచారన్నది వాస్తవం. అయినా.. రఘరామ ద్రోహానికి దిగారు. టీడీపీ కోసం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కోసమే పని చేస్తూ వచ్చారు. కేవలం బాబు చెబితేనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కోర్టుల్లో కేసులు వేశారాయన. బాబు చెబితేనే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చారు. అలాంటి రఘురామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధం అయ్యారా?.. 

రఘురామ కృష్ణంరాజు ఆటిట్యూడ్‌ మొదటి నుంచి తేడానే. తనకు ఢిల్లీ లెవల్‌లో పరిచయాలు ఉన్నాయని.. నరసాపురం సీటు తనకేనంటూ విర్రవీగుతూ వచ్చారు. అయితే కూటమి తరఫునే తన పోటీ అని ప్రకటించుకున్న రఘురామ.. ఏ పార్టీ అనేదానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. చంద్రబాబు మీద నమ్మకం వల్లే అంత బహిరంగంగా ఆయన స్టేట్‌మెంట్లు ఇచ్చారు. కానీ, సీటు పొత్తులో భాగంగా బీజేపీకి పోయింది. ఆ పార్టీ తరఫున శ్రీనివాస వర్మ పేరును అధికారికంగా ప్రకటించింది. దీంతో.. రఘురామ ఢీలా పడ్డారు. ఆ ఫ్రస్ట్రేషన్‌లోనూ చంద్రబాబును తిట్టే ప్రయత్నం చేయలేదు. ఏపీ బీజేపీకి తనకు మంచి సంబంధాలు లేవని, పైగా తనకు టికెట్‌ రాకుండా చేసింది సీఎం జగనేనంటూ విచిత్రమైన విమర్శ ఒకటి చేశారు.   

నరసాపురం టికెట్‌ బీజేపీకి పోవడంలో చంద్రబాబు వదినమ్మ పురంధేశ్వరి కీలక పాత్ర పోషించారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనీసం పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్‌ ఎలా? ఇస్తామంటూ  ఏపీ బీజేపీ నేతలు సైతం రఘురామకు చురకలు ఇస్తూ వచ్చారు. ఈలోపు చంద్రబాబుతో రఘురామ చీకటి ఒప్పందాలకు తెర లేపారు. ఒకవైపు.. ఎలాగైనా నరసాపురం టికెట్‌ దక్కించుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేశారు. మరోవైపు.. పొత్తులు కుదిరిన తర్వాత కూడా తనను మించి మరొక అభ్యర్థి వారికి(కూటమికి) దొరకరని గప్పాలు కొడుతూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా డీల్‌ సెట్‌ అయినట్లు సంకేతాలిచ్చారు. 

‘‘ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణమే నా ఎంపీ సీటు పోతుంది. మాట్లాడించుకున్నన్ని రోజులు మాట్లాడించుని.. ఇప్పుడు సభ్యత్వం లేదంటున్నారు. కూటమి నెగ్గాలనుకున్నా. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా. తనకు బాబు న్యాయం చేస్తారని విశ్వాసం ఉంది’’ అని తాజాగా మరో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు రఘురామ.

ఎంపీ నో ఛాన్స్‌.. మిగిలిందే అదే!

రఘురామను నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా నిలపాలని చంద్రబాబు నిజంగా గట్టిగానే ప్రయత్నించారా?. నిజంగానే చంద్రబాబు వల్ల అది కాలేదా?. ధన బలం కూడా రఘురామకు సీటు ఇప్పించలేకపోయిందా? ఇలాంటి ప్రశ్నలెన్నో. అయినప్పటికీ వెస్ట్‌ గోదావరిలో టీడీపీ అత్యంత సేఫ్ సీట్లలో ఒకటైన ఉండి నుంచి రఘురామ పోటీ చేస్తారనే ప్రచారం ఒకటి ఊపందుకుంది. ప్రస్తుతం ప్రకటించిన సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును చంద్రబాబు తప్పించి, వీర విధేయుడు రఘురామకు టికెట్‌ కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ఆ ప్రచారా సారాంశం. అయితే ఈ ప్రచారం తెర మీదకు రాగానే మరో టీడీపీ నేత కలవపూడి శివ అప్రమత్తం అయ్యారు. టికెట్‌ తనదేనంటూ భీస్మించుకుని ఊర్చున్నారు. ఒకవేళ వర్గ పోరు తలనొప్పి చంద్రబాబు వద్దనుకుంటే ఉండి స్థానంలోనూ రఘురామకు చుక్కెదురయ్యే అవకాశం లేకపోలేదు.  

రఘురామ కృష్ణంరాజుకు ఏదో ఒక పార్టీలో సభ్యత్వం ఉండడమే ఇప్పుడు ప్రధానం. అందుకే టీడీపీలో చేరేందుకు రంగం సిద్దపడ్డారు. తద్వారా  ఏదో స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. మొత్తంగా అడ్డదారిలో ఎన్నికల బరిలో దిగడానికి రఘురామ మార్గం సుగమం చేసుకుంటున్నారనేది ఆయన ప్రయత్నాలతో స్పష్టమవుతోంది. కానీ, రాజకీయ మనుగడ కోసం నమ్మినోళ్లనే మోసం చేసిన చంద్రబాబు, కుటుంబ సభ్యుల్నే రోడ్డు మీదకు తెచ్చిన చంద్రబాబు.. అవసరం తీరిపోయింది గనుక రఘురామ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? లేదంటే తనకు అలవాటైన వెన్నుపోటు రాజకీయం ప్రదర్శిస్తారా? అనేది ఒకట్రెండు రోజుల్లోనే తేలిపోనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement