ఆరెస్సెస్ మూలాలు, రామమందిరం, గో సంరక్షణ కోసం పోరాటం, ఓబీసీ కులం కార్డు ఇవన్నీ కలిపి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను రాష్ట్ర బీజేపీలో శక్తిమంతుడిగా మార్చాయి. గత ఎన్నికల్లో సీఎం కావల్సిన వ్యక్తికి ఆఖరి నిమిషంలో పదవి చేజారిపోయింది. ఇప్పుడు ఇతర కీలక ఓబీసీ నేతలు పార్టీని వీడడంతో అంతా తానై వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ ఎంత ముఖ్యమో, ఓబీసీ వర్గాల్లో, పార్టీలో మంచి పట్టున్న మౌర్య కూడా అంతే ముఖ్యం. అందుకే ఇద్దరి మనసు నొప్పించకుండా, కలుపుకొని ముందుకు వెళుతోంది కమలదళం. గత ఎన్నికల్లో ఏకంగా 200 ర్యాలీలు నిర్వహించి పార్టీ గెలుపులో కీలకంగా మారిన మౌర్య ఈసారి కూడా ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపై నడిపిస్తున్నారు.
యాదవేతర ఓబీసీ ఓట్లను సంఘటితం చేసే ప్రధాన బాధ్యతను తీసుకొని అందులో విజయం సాధించారు. రాష్ట్రంలో 45% మంది ఓబీసీలు ఉంటే యాదవులు మొదట్నుంచీ ఎస్పీ వైపే ఉన్నారు. మిగిలిన ఓబీసీలందరూ బీజేపీ వైపు ఆకర్షితులు కావడంతో ఆ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 312 సీట్లతో ఘన విజయం సాధించింది.
అప్పట్లో యూపీ సీఎం పదవి మౌర్యకే దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా యోగి ఆదిత్యనాథ్ తెరపైకి రావడంతో మౌర్యకి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్నారు.
2019లో యోగి ఆదిత్యనాథ్‌కు అత్యంత సన్నిహితుడు, ఓబీసీ నాయకుడు స్వతంత్రదేవ్ సింగ్‌కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించడాన్ని మౌర్య జీర్ణించుకోలేకపోయారు.
అప్పట్నుంచి అసంతృప్తితో ఉన్నప్పటికీ ఆరెస్సెస్ జోక్యంతో యోగి, మౌర్య మళ్లీ ఒక్కటయ్యారు.
ఈసారి ఎన్నికల్లో ఓబీసీ నాయకులు స్వామి ప్రసాద్ మౌర్య సహా పలువురు ఎస్పీ బాట పట్టడంతో బీజేపీలో ఓబీసీలకు పెద్ద దిక్కుగా మారారు.
టికెట్ల పంపిణీలో బీజేపీ నాయకత్వం మౌర్య చెప్పిన మాటకు అధిక ప్రాధాన్యాన్నే ఇచ్చింది.
ఎస్పీ బాట పట్టిన ఓబీసీ నాయకులు కూడా కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యక్తిత్వాన్ని గొప్పగా చెబుతారు. బీజేపీలో ఆయనకి అన్యాయం జరుగుతోందని, నిస్సహాయంగా ఉండిపోయారని కామెంట్లు చేస్తూ ఉంటారు.
చాయ్‌వాలా
కేశవ్‌ప్రసాద్ మౌర్య మృదుభాషి. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నవారు. వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీలాగే చిన్నప్పుడు తన తండ్రి శ్యామ్‌లాల్ మౌర్యతో కలిసి టీ అమ్మేవారు. పేపర్ బాయ్‌గా పని చేశారు. ఇంటర్మీడియట్ చదివారు. అది కూడా గుర్తింపు లేని కళాశాలలో చదవడంతో ఆయన విద్యార్హతలపై వివాదాలున్నాయి. సహచర ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఆయన గురించి చాలా గొప్పగా చెబుతారు. మొదట్నుంచీ యూపీలో పార్టీని పటిష్టపరచడానికి పని చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్‌లో ఎవరికి విలువ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు యోగి, ఇటు మౌర్య ఎవరినీ వదలుకోలేని స్థితిలో పార్టీ కొట్టుమిట్టాడింది. అప్పుడు స్వయంగా ఆరెస్సెస్ రంగంలోకి దిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక మెట్టు దిగి స్వయంగా మౌర్య ఇంటికి వెళ్లి మాట కలిపారు. సంఘ్ అగ్రనాయకుల సమక్షంలో ఇద్దరూ రాజీకి రావడంతో బీజేపీ కేడర్ ఊపిరిపీల్చుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లాలోని సిరాథు గ్రామంలో 1969 మే 7న జన్మించారు.
యుక్త వయసులోనే ఆరెస్సెస్, బజరంగ్‌దళ్‌లో సభ్యునిగా ఉన్నారు.
గో సంరక్షణ, రామజన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
రాజకుమార్ మౌర్యను పెళ్లాడారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
2002లో తొలిసారిగా బాందా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే కేవలం 204 ఓట్లు వచ్చాయి.
2007లో రెండోసారి అలహాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా బీఎస్పీ
అభ్యర్థి చేతిలో ఓడిపోయారు
2012లో ముచ్చటగా మూడోసారి సిరాథు నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి ఆనంద్ మోహన్‌పై 9 వేల ఓట్లతో విజయం సాధించారు
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఫుల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. పోలయిన ఓట్లలో 52 శాతం ఓట్లు సాధించి రికార్డ్ సృష్టించారు.
2016లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రముఖ ఓబీసీ నాయకుడిగా ముందుండి నడిపించారు. మరే నాయకుడు చేయలేని విధంగా 200 ర్యాలీలు చేపట్టారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment