బీఆర్‌ఎస్‌తోనే రక్ష! : మాజీ సీఎం కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌తోనే రక్ష! : మాజీ సీఎం కేసీఆర్‌

Published Mon, Apr 29 2024 4:47 AM

ఆదివారం రాత్రి హనుమకొండ చౌరస్తాలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. హాజరైన జనం

14– 15 మంది బీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రానిదే కీలకపాత్ర

హనుమకొండ బస్సుయాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ 

గోదావరి ఎత్తుకుపోతామంటున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలి? 

అది ప్రమాదకర పార్టీ.. విద్వేషం నింపడమే దాని పని

హామీలిచ్చి అమలు చేయని కాంగ్రెస్‌కు ఓటేస్తే ఏం లాభం? 

అడ్డగోలు హామీలు చూసి ఓట్లేస్తే.. 4 నెలల్లో ఆగం చేశారు 

లంచాల కోసం బిల్డింగ్‌ పర్మిషన్లు ఆపేశారని ఆరోపణ

సాక్షి, వరంగల్‌: ‘‘ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా బీజేపీకి 400 సీట్లు కాదు.. కనీసం 200 సీట్లు దాటేలా లేవు. మనకు ఇదే మంచి సమయం. తెలంగాణలో లోక్‌సభ సీట్లన్నీ గెలిస్తే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడుతాం. కేంద్రంలో హంగ్‌ వస్తే కీలకపాత్ర పోషించే అవకాశం ఈ రోజు తెలంగాణకు ఉంది..’’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

మన గోదావరి నీళ్లను ఎత్తుకుపోతామన్న బీజేపీకి.. హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రయోజనం ఉండదన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్ర ఆదివారం హనుమకొండకు చేరుకుంది. పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి హనుమకొండ చౌరస్తా వరకు కేసీఆర్‌ రోడ్డు షో నిర్వహించారు. కూడలి వద్ద ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘గోదావరి నదిని తీసుకొని పోతా అంటూ ఓట్లు పడే టైంలో నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్‌ పంపించాడు. ప్రాణం పోయినా ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పెట్టాలి. నేనున్నప్పుడు అదే పంచాయతీ పెట్టిన. ఆయనేమో ఎత్తుకుపోతా అంటరు. ఈ చేతకాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నోరు మూసుకొని పడి ఉంది. 

అందులో ఏం మతలబు దాగి ఉంది. ఎవరూ కాపాడాలి? దయచేసి మన గోదావరిని, కృష్ణాను కాపాడుకోవాలన్నా.. తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా.. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా.. నిరుద్యోగ సమస్య తీరాలన్నా.. మన బతుకులు బాగు పడాలన్నా.. కచ్చితంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలవాలి. అదే తెలంగాణకు క్షేమం. దయచేసి ఆలోచన చేయాలి. 

లంచాల కోసమే కాంగ్రెస్‌ పర్మిషన్లు ఆపింది 
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రమంతా భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెరిగింది. కానీ ఇప్పుడు డౌన్‌ అయింది. దాని మీద బతికే వేల మంది రోడ్ల మీద పడ్డారు. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు పెద్ద పట్టణాల్లో ఐదు నెలలుగా బిల్డింగ్‌ పర్మిషన్లు ఇస్తలేరు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో టీఎస్‌ బీపాస్‌ తెచ్చి.. అప్లికేషన్‌ పెడితే 21 రోజుల్లో ఆటోమేటిగ్గా పర్మిషన్లు ఇచ్చేయాలని చట్టం చేసినం. 

ఇప్పుడున్న సీఎం, వారి మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా. ఎవరైనా బిల్డింగ్‌లు కడితే చదరపు మీటర్‌కు ఇంత అని కాంగ్రెస్‌కు లంచం ఇవ్వాలట. దానికోసం మొత్తం రాష్ట్ర ప్రగతిని, అభివృద్ధిని ఆపేశారు. అంతేకాదు పూర్తయిన భవనాలకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు. ఈ బండారమంతా బయటపెడతాం. త్వరలోనే దీనిపై పార్టీ కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. 

ఒక్క హామీ కూడా అమలు చేయలేదు 
ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు. మొన్న ఎక్కడనో మాట్లాడుతూ కృష్ణానది కూడా నేనే కట్టిన అంటడు. ప్రపంచంలో ఎవరైనా నది కడతారా? ‘ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటే ఎగిరి ఎగిరి తన్నిండంట’ అన్నట్టు ఉన్నది. అడ్డగోలు హామీలు చూసి ఓట్లేస్తే.. నాలుగైదు నెలల్లోనే ఆగమాగం చేసేశారు. తెలంగాణకు ఏమైందో అర్థం కావడం లేదు. 

కరెంట్‌ ఎక్కడికి పోయింది? సాగునీళ్లు ఏవి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచి నీళ్ల కరువు ఎందుకు వస్తోంది? కాంగ్రెస్‌ సర్కారు ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయలేదు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు. ఏమైంది? రైతుబంధు అందరికీ రాలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. డిసెంబర్‌ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ అన్నారు. ఏదీ కాలేదు.

అచ్ఛేదిన్‌ కాదు.. సచ్చేదిన్‌..
బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపూ పంచాయతీలు పెట్టించడం, విద్వేషం నింపడమే. ఆ పార్టీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. దయచేసి యువతను కోరుతున్నా.. ఆవేశం కాదు.. ఆలోచన చేయాలి. ఈ దేశం మీది. ఈ రాష్ట్రం మీది. రేపటి భవిష్యత్‌ మీది. ప్రధాని మోదీ భేటీ బచావో, భేటీ పడావో, జన్‌ ధన్‌ యోజన వంద నినాదాలు చెప్పారు. విదేశాల నుంచి నల్లధనమంతా తెచ్చి ఇంటికి రూ.15 లక్షల చొప్పున ఇస్తానన్నారు. 

ఎవరికైనా కనీసం ఐదు రూపాయలన్నా వచ్చాయా? అచ్ఛే దిన్‌ అచ్ఛే దిన్‌ అన్నారు.. అది రాలేదు కానీ సచ్చేదిన్‌ వచ్చింది. ధరలు విపరీతంగా పెరిగాయి. రూపాయి విలువ పడిపోయింది. కేంద్రంలో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఖాళీ కూడా నింపలేదు. విభజన చట్టంలో కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇస్తామని ఉంటే.. మోదీ దానిని గుజరాత్‌కు ఎత్తుకెళ్లారు. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి?’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 

Advertisement
Advertisement