రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: కేటీఆర్‌ | BRS Leader KTR Fires On Congress Party | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: కేటీఆర్‌

Published Sun, Jul 21 2024 6:25 AM | Last Updated on Sun, Jul 21 2024 6:25 AM

BRS Leader KTR Fires On Congress Party

మా ఎమ్మెల్యేలను భయపెట్టి చేర్చుకుంటున్నారు 

ప్రభుత్వం ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తోంది  

గవర్నర్‌కు వివరించిన బీఆర్‌ఎస్‌ బృందం 

‘ప్రొటోకాల్‌’పై ప్రభుత్వాన్ని వివరణ కోరతానని గవర్నర్‌ చెప్పారు: కేటీఆర్‌ 

జాబ్‌ కేలండర్‌పైనా లేఖ రాస్తామన్నారు.. 

గ్రూప్‌ 2 వాయిదాతో సీఎంకు ఎన్ని కోట్లు ముట్టాయో?.. మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్‌ భూతద్దంలో చూపిందని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలను రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని కూడా కలుస్తామన్నారు. కాంగ్రెస్‌ నేత రాహు­ల్‌ గాంధీ ఓ వైపు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్లు పోజులు కొడుతూ మరోవైపు దానిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. 

కేటీఆర్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్యనాయకులు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో సుమారు అరగంటసేపు భేటీ అయ్యారు. నిరుద్యోగుల సమస్యలు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై గవర్నర్‌కు వినతిపత్రాలు సమరి్పంచి, అందులోని అంశాలను కేటీఆర్, హరీశ్‌రావు గవర్నర్‌కు వివరించారు. అనంతరం గవర్నర్‌తో భేటీ వివరాలను కేటీఆర్‌ మీడియాకు వెల్లడించారు.  

‘రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతున్న తీరును గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్లు గవర్నర్‌కు వివరించాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఓ వైపు న్యాయపోరాటం చేస్తున్నాం. మరోవైపు స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశామనే విషయాన్ని గవర్నర్‌కు వివరించాం. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్సీలు, పది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోచేరినా వారిపై చర్యలు లేవనే విషయాన్ని ప్రస్తావించాం. 

ప్రొటోకాల్‌ ఉల్లంఘనతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పాం. ఎమ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లడం సరికాదనే అభిప్రాయం గవర్నర్‌ వ్యక్తంచేశారు. ఈ అంశంపై ప్రభుత్వ వివరణ కోరుతూ లేఖ రాస్తానని గవర్నర్‌ హామీ ఇచ్చారు. విపక్ష పారీ్టగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తనను కలవాలని గవర్నర్‌ చెప్పారు. తన పరిధిలో ఉన్న అంశాల్లో తప్పనిసరిగా న్యాయం చేస్తానన్నారు. నిరుద్యోగుల విషయంలో గవర్నర్‌ సీరియస్‌గా స్పందించిన తీరుకు అభినందనలు’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

గవర్నర్‌ సీరియస్‌గా స్పందించారు 
‘రాష్ట్రంలో యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీల ఉల్లంఘనను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామనే హామీని నిలబెట్టుకోలేదు. సిటీ సెంట్రల్‌ లైబ్రరీ, ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి, కేసులతో భయానక వాతావరణం నెలకొంది. ఈ అంశంపై హోం శాఖ కార్యదర్శిని పిలిచి మాట్లాడతానని గవర్నర్‌ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేరేంత వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుంది’అని కేటీఆర్‌ చెప్పారు. 

‘మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకుపోయి కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు గంగపాలైందని భూతద్దంలో చూపుతూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి. కొద్దిరోజుల్లోనే మరమ్మతులు పూర్తయి ప్రస్తుతం మేడిగడ్డ నిండుకుండను తలపిస్తోంది. త్వరలో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్‌ సెంటర్లకు వందల కోట్ల రూపాయల లాభం వస్తుందని సీఎం రేవంత్‌ చెప్పారని, ఇప్పుడు నాలుగు నెలలపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఆయనకు అందులో వాటా ఎంత వస్తుందని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

చేసింది చెప్పుకోవడంలోనే ఉంది: గవర్నర్‌ 
ప్రస్తుత రాజకీయాల్లో చేసింది చెప్పుకోలేక పోవడంతో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ బీఆర్‌ఎస్‌ బృందంతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గతంలో తమిళనాడులో కామరాజ్‌ నాడార్‌ ప్రభుత్వం అనేక మంచి పనులు చేసినా.. చేసింది చెప్పుకోలేక ఓటమి పాలైన విషయాన్ని గవర్నర్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. 

ప్రస్తుత రాజకీయాలన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయని, పార్టీ ఫిరాయింపులు సహా ప్రజలు అన్ని అంశాలను నిశితంగా గమనిస్తారని చెప్పినట్లు సమాచారం. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్‌ అద్భుతంగా నిర్మించారని కితాబునిచ్చినట్లు తెలిసింది. గవర్నర్‌తో భేటీలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement