సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధిపై, మహానేత వైఎస్సార్ కుటుంబం చేసిన అభివృద్ధిపై బహిరంగచర్చకు సిద్ధమా? అని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సవాల్ విసిరారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మహానేత వైఎస్సార్ కుటుంబంతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిందని కొనియాడారు. విశాఖలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ నాయకుడు విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తుంటే చూసి ఓర్వలేక చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన టీడీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని చర్చా కార్యక్రమాలు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా స్వాగతించి, తర్వాతే చర్చా వేదికలు పెట్టుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర పరిరక్షణ, చర్చావేదిక పేరుతో విశాఖలో సోమవారం టీడీపీ నిర్వహించే ఈ సమావేశానికి రూ.150 కోట్ల కుంభకోణంలో నిందితుడైన అచ్చెన్నాయుడు, మాన్సాస్ ట్రస్టులో భూములు కాజేసిన అశోక్‌గజపతిరాజు ముఖ్య అతిథులుగా రానుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
ఎవరూ అడ్డుకోలేరు..
ఉత్తరాంధ్రపై ప్రేమ చూపించే చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత విశాఖను ఎందుకు రాజధాని చేయలేదు? అప్పుడే చేసుంటే దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా విశాఖ అభివృద్ధి చెంది హైదరాబాద్‌తో పోటీపడగలిగేది. ఆనాడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ కోసం నిర్మాణం చేపడుతుంటే, ఏ నిర్మాణాలు కట్టడానికి వీల్లేదంటూ పిటిషన్‌లు వేసి టీడీపీ అడ్డుకున్నది నిజంకాదా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. కార్మికులంతా రోడ్లమీదకు వచ్చి నిరసన తెలుపుతుంటే టీడీపీ నేతలు ఎక్కడ దాక్కున్నారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆశోక్‌గజపతిరాజు అలసత్వం కారణంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఈ దుస్థితి ఏర్పడింది. విశాఖ పరిపాలన రాజధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరు. లోక్‌సభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖను అధికారికంగా కేంద్రమే ధ్రువీకరించింది.
కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిలిచారు. రెండున్నరేళ్లగా దాదాపు 1.10 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమయ్యాయి. ఈ రెండేళ్ల మూడు నెలల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనకాపల్లి, పాడేరుల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టింది. మరోవైపు విజయనగరానికి మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కళాశాల అయినా ఏర్పాటుచేశారా? ఆనాడు వైఎస్సార్ సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు 8 లక్షల ఎకరాలకు నీరు తెచ్చే యత్నం చేశారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ రూ.2,500 కోట్ల ప్యాకేజీతో అనకాపల్లి నుంచి ఫేజ్–1, ఫేజ్–2లో నిర్మాణాలు చేపడుతున్నారు. అలాంటి సుజల స్రవంతిపై మాట్లాడడానికి చంద్రబాబుకు, ఆయన తనయుడికి సిగ్గుండాలి’ అని అమర్‌నాథ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రవిరెడ్డి, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
Published Mon, Aug 30 2021 4:51 AM | Last Updated on Mon, Aug 30 2021 6:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment