పాలకొల్లులో రెండుసార్లే వరుస విజయాలు
మూడోసారి పట్టం కట్టని నియోజకవర్గ ప్రజలు
సీఎం జగన్ పాలనలో కనీవినీ ఎరుగని అభివృద్ధి
రూ.475 కోట్లతో శరవేగంగా వైద్య కళాశాల పనులు
రూ.కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుడాల గోపికి జనాదరణ
కూటమిలో అసమ్మతి సెగలు
ఎమ్మెల్మే రామానాయుడు వెన్నులో వణుకు
సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని హ్యాట్రిక్ గండం వెంటాడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుడాల గోపికి లభిస్తున్న జనాదరణ, కూటమిలోని అసమ్మతి సెగలు, వరుసగా మూడోసారి పట్టం కట్టని పాలకొల్లు ప్రజల నాడి ఆయనకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికల్లోనూ చరిత్రే పునరావృతమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
70 ఏళ్ల చరిత్ర
పాలకొల్లు శాసనసభ నియోజకవర్గానికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. 1955 నుంచి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983, 1985 అలాగే 1994, 1999 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు అల్లు వెంకటసత్యనారాయణ గెలుపొందారు. అయితే వరుసగా మూడోసారి పోటీచేసిన సందర్భంలో ప్రజలు ఆయన్ను ఓడించారు. తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలుపొందుతూ వచ్చిన రామానాయుడు ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు ఏ అభ్యరి్థకీ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి ప్రజలు పట్టం కట్టడం పాలకొల్లు చరిత్రలో లేదు.
ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల ప్రచార ఆర్భాటంలో తప్ప అభివృద్ధిలో తనదైన ముద్రను వేసుకోలేకపోయారు. చెప్పుకోదగిన స్థాయిలో ప్రజాసమస్యలను పరిష్కరించలేకపోయారు. అయితే సీఎం జగన్ పాలనలోని ఈ ఐదేళ్లలో కులమత వర్గాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ లబ్ధిని చేకూర్చడంతో పాటు అభివృద్ధి పనుల్లోనూ పాలకొల్లుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పాలకొల్లు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సుమారు రూ.1,440 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా 6.84 లక్షల మంది లబి్ధదారులకు రూ.619 కోట్ల లబ్ధి చేకూరింది.
మెడి‘కల’ సాకారం
పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్ల వ్యయంతో 61 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 150 మంది విద్యార్థులు కళాశాలలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించనున్నారు. వంద పడకల ఆస్పత్రికి నిధుల మంజూరు లేకుండానే గత ఎన్నికల ముందు ఎమ్మెల్యే నిమ్మల ప్రజలను నమ్మిచేందుకు బోగస్ శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. కాగా సీఎం జగన్ పాలనలో రూ.16.60 కోట్ల వ్యయంతో 150 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టి పూర్తిచేయడం గమనార్హం. రూ.15 కోట్లతో పాలకొల్లులో తాగునీటి ఫిల్టర్ బెడ్ నిర్మించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రచారాస్త్రంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
అసమ్మతి సెగలు
ఎమ్మెల్యే నిమ్మల వైఖరిపై కూటమి నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. స్వతహాగా కిందిస్థాయి కేడర్‌ను ఎదగనివ్వరని ఆయనకు పేరుంది. కూటమిలోని జనసేన, బీజేపీ నేతల విషయంలోను అదే వైఖరిని అవలంబిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి అవసరమైన సామగ్రిని అభ్యర్థి సమకూరుస్తుంటారు. కాగా ప్రచారంలో పాల్గొనే కూటమి నాయకులను ఎవరి పార్టీ జెండాలు వారే తెచ్చుకోవాలని సూచిస్తుండటంతో పాటు ప్రచారం చేసే సమయంలో తనను దాటుకుని ఎవరూ ముందుకు వెళ్లకూడదని ఆయన చెబుతున్నారంట. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీజేపీ పోటీ చేస్తున్న నేపథ్యంలో వారు జెండా ఖర్చులు భరించుకుంటారని, మద్దతు తెలుపుతున్న తమపై ఖర్చులు రుద్దుతున్నారని జనసేన నాయకులు అంటున్నారు.
పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం సరిగా చెప్పడం లేదని మండిపడుతున్నారు. నియోజకవర్గంలో పట్టున్న జనసేన పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర చైర్మన్ బన్నీ వాసు ప్రెస్‌మీట్లకే తప్ప ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబునాయుడు వచ్చిన సందర్భంలో బన్నీవాసును వేదికపైకి రాకుండా అడ్డుకోవడం పట్ల ఆయన మనస్తాపానికి గురై వెళ్లిపోవడంతో మరుసటిరోజు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. ఆ అవమానభారంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. బీజేపీ నేతలకు కూడా నిమ్మల వ్యవహారశైలి మింగుడు పడటం లేదు.
ప్రజలతో గోపి మమేకం
ఓ పక్క ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుడాల గోపి ప్రజలతో మమేకమవుతుంటే.. ఓటర్లను ఆకట్టుకునే విన్యాసాలే తప్ప చెప్పుకోవడానికి చేసిందేమీ లేదన్నట్టుగా నిమ్మల ప్రచారం సాగుతోందని సొంతగూటి నేతలే చెప్పుకుంటున్నారు. ఒక పక్క అధికార పక్షం జోరు, మరోపక్క పాల కొల్లు సెంటిమెంట్‌తో చరిత్ర పునరావృతమవుతుందని చెవులు కొరుక్కుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment