వైఎస్సార్సీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ ధర్నా రెండు లక్ష్యాలను నెరవేర్చిందని చెప్పాలి.ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న ఆటవిక పాలన తీరుతెన్నులను రాజధాని ఢిల్లీ వేదికగా దేశ ప్రజలందరికి వెల్లడించగలిగారు. అదే టైంలో ఇంతకాలం దాదాపు ఒంటరియానం చేసిన వైఎస్సార్‌సీపీకి తోడు ఎవరైనా వస్తారా?అన్న డౌటు వచ్చినవారికి ఒక సమాధానం లభించినట్లయింది. మొత్తం.. తొమ్మిది రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ ధర్నాకు వచ్చారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజవాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ ధర్నాకు వచ్చి సంఘీభావం తెలపడం హైలైట్ అని చెప్పాలి.డిల్లీ ధర్నాలో ఫోటో ఎగ్జిబిషన్‌ను ఈ నేతలు తిలకించారు. ఏపీలో టీడీపీ గూండాలు అరాచకంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను నరికి చంపడం, ఆస్తులు విధ్వంసం, ఎంపీ కార్లను సైతం ద్వంసం చేయడం వంటి సన్నివేశాలను చూసి ఈ నేతలంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఇంత ఘోరంగా ఉందా?ఆయన కుమారుడు లోకేష్ ఇంత అరాచకంగా రెడ్ బుక్ అని పెట్టి ప్రత్యర్ధి రాజకీయ పార్టీలవారిని బెదిరించడం, ఆయన మనుషులు దాడులకు పాల్పడడం వంటివి చేస్తుంటే చర్యలు తీసుకునే పరిస్థితి లేదా? అని విస్తుపోయారు. అసలు రెడ్ బుక్ కాన్సెప్ట్ అన్నదే కొత్తది అయితే,అలాంటివాటిని అమలు చేస్తున్నవారిపై కేసులు పెట్టవలసిన పరిస్థితి ఉండగా, టీడీపీ రాక్షసపాలనను అడ్డుకునేవారే లేకుండా పోయారని ఆయా పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
దీంతో.. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వ డొల్లతనం బయట రాష్ట్రాల నేతలకు కూడా కళ్లకట్టినట్లు చెప్పినట్లయింది. జగన్ వీరందరికి దగ్గరుండి ఆ వివరాలు తెలియచేయడమే కాకుండా వీడియో క్లిప్పింగ్ లను కూడా ప్రదర్శించారు. అదే సమయంలో.. జగన్ ఢిల్లీ ధర్నాను తక్కువ చేసి చూపడానికి మద్యం పై శ్వేతపత్రం డ్రామాను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఢిల్లీ ధర్నాకు మొదటి పేజీలో కవరేజీ ఇవ్వకుండా , చంద్రబాబు శ్వేతపత్రానికే ప్రాధాన్యం ఇచ్చి, ఎప్పటికీ తాము చంద్రబాబు భజనలోనే తరిస్తామని తేటతెల్లం చేసింది.చంద్రబాబు పత్రం గురించి వార్తలు ఇవ్వడం తప్పుకాదు. కానీ,
ఒక ప్రధాన పార్టీ ఢిల్లీలో అంత పెద్ద ధర్నా చేపడితే కవరేజీ ఇవ్వడానికి వారికి మనసు రాలేదు. జర్నలిజం ప్రమాణాలను రోజురోజుకు దిగజార్చుతున్న వైనం కనిపిస్తూనే ఉంది. ఇక వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలంతా ఈ ధర్నాలో పాల్గొనడం,రాష్ట్రం నలుమూలల నుంచి ముఖ్యమైన నేతలు, కార్యకర్తలు తరలివెళ్లడం ద్వారా పార్టీలో నైతిక స్పూర్తి వచ్చినట్లయింది.దీంతో రాష్ట్రంలో ఈ దాడుల పర్వం కాస్త ఆగే అవకాశం ఉంది.అలాగే పోలీసులు కూడా తాము మరీ అప్రతిష్ట పాలవుతున్నామన్న భావనతో దాడులకు పాల్పడ్డవారిపై కొంతమేర అయినా చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేశ వ్యాప్తంగా దాదాపు ఈ నేతలందరితో పరిచయాలు ఉన్నాయి. గతంలో ప్రత్యేక హోదా అంశం సమయంలో డిల్లీలో ఆయన కూడా ధర్నాలు నిర్వహించి ,ఆయా రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ తోను, ఇటు బీజేపీతోను ఆయన కూటమి కట్టిన అనుభవం ఉంది. అందువల్ల వారందరి దృష్టిలో చంద్రబాబు పాలనపై తక్కువ అబిప్రాయం కలుగుతుంది. అది కూడా ఆయనకు అప్రతిష్ట అవుతుంది. ఈ రకంగా వైసిపి ధర్నా ఎపిలో సాగుతున్న దమనకాండకు ముగింపు పలకడానికి ఉపయోగపడుతుంది. మరో కోణం చూద్దాం..
ఇంతకాలం వైఎస్సార్‌సీపీ వివిధ కారణాల రీత్యా ఏ ఇతర రాజకీయపార్టీలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నా, ఆ తర్వాత పరిణామాలలో జగన్ ను ఆ పార్టీ ఇబ్బంది పెట్టినందున దానికి దూరం అయ్యారు. బీజేపీ వారికి సానుభూతి ఉన్నా, గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ మద్దతు ఏదో రకంగా తీసుకున్నా.. ఇప్పుడు వారు టీడీపీతో ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నందున వైఎస్సార్‌సీపీకి సహకరించే పరిస్థితి లేదు. కనీసం సంఘీభావం ప్రకటించలేదు. దీంతో అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీయే కూటములకు సమదూరంలో ఉంటూనే వైఎస్సార్‌సీపీ తోడు ఎవరు వస్తారా? అని ప్రశ్న తలెత్తింది. ఆ తరుణంలో సమాజ్‌వాదీ పార్టీతో సహా తొమ్మిది పార్టీలు ధర్నాకు హాజరై వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వడం , చంద్రబాబు పాలనను తప్పు పట్టడం, అధికారం ఎవరికి శాశ్వతం కాదని చెప్పడం వంటివాటితో జగన్ కు జాతీయ స్థాయిలో మంచి పట్టే ఉందనే భావన కలుగుతోంది.
జగన్‌ను తొమ్మిది పార్టీలు కలిస్తే, వాళ్లలో ఒక్క అన్నాడీఎంకే తప్ప మిగిలినవన్నీ ఇండి కూటమిలోనే పార్టీలే. ఉద్దావ్ ధాక్రే వర్గానికి చెందిన శివసేన నేత అయితే నేరుగా వైస్సార్‌సీపీని ఇండియా కూటమిలో చేరాలని పిలుపు ఇచ్చారు. అలా చేస్తారన్న గ్యారంటీ లేదు. కాని,జగన్ భవిష్యత్తులో ఆయా రాజకీయ పక్షాలతో సత్సంబంధాలు నెరపడానికి అవకాశం ఉంది. బీజేపీ,కాంగ్రెస్ తో పాటు వామపక్షాలవారు కూడా ఈ ధర్నాకు రాలేదు. వామపక్షాలవారు కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా.. మొదలైన పార్టీల నేతలు వచ్చారు. లోక్ సభ మాజీ స్పీకర్ తంబిదురై ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ లెక్కన.. జాతీయ కూటమిలో చేరడమో,లేక ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కొత్త శక్తిగా తయారవడమో అనే అంశాలపై జగన్ ఆలోచిస్తారేమో చూడాల్సి ఉంది.
అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలో అత్యంత కీలకమైన నేతగా ఉన్నారు. ఆయన ఈ ధర్నాకు రావడంతో ఉత్తరాది రాష్ట్రాలలో రాజకీయ పక్షాల దృష్టి ఇటువైపు పడుతుంది. ఆ రకంగా వైఎస్సార్‌సీపీకి ఇది ఉపయోగపడుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రావడంతో పశ్చిమబెంగాల్ లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సానుభూతి కూడా లభించినట్లయింది. డీఎంకే అధినేత స్టాలిన్ వంటివారు తమ ప్రతినిధిని పంపించి ఉండాల్సింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక ఎంపీని పంపించి ఉంటే రాజకీయంగా చాలా ప్రాధాన్యత వచ్చేదేమో!. కాని ఇంకా ఆ పరిస్థితి రాలేదు.
రాజకీయాలలో ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటారు. ప్రస్తుతం బీజేపీ-కాంగ్రెస్ ఆ దశలోనే ఉన్నాయి. ఈ రెండు కూటములలో వైఎస్సార్‌సీపీకి స్థానం లేకుండా చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జగన్ ప్రజలను నమ్ముకుంటే.. చంద్రబాబు వ్యూహాలపై ఆదారపడి రాజకీయాలు చేస్తుంటారు. అయితే జగన్ ఇప్పటికైనా వాటన్నింటిని గమనించి మొదటిసారి జాతీయ స్థాయిలో తన రాజకీయం చేసి సఫలం అయ్యారని చెప్పాలి.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment