జగిత్యాల, జగిత్యాల క్రైం, ధర్మపురి, సిరిసిల్ల, సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది గతమని, ఇప్పుడా పార్టీ ఖతమైందని, వారంటీ ముగిసిన పార్టీ గ్యారంటీ ఎలా ఇస్తుందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. 150 ఏళ్ల కాంగ్రెస్ వారంటీ అయిపోయిందని, ఆరు గ్యారంటీలు ఇస్తే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు 24 గంటల కరెంట్‌పై అనుమానం ఉందని, జగిత్యాల నియోజకవర్గానికి వచ్చి కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ దరిద్రం పోతుందని వ్యాఖ్యానించారు.
రేవంత్ ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్
రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్ అని, ఆ పార్టీ నేత పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సోనియాకు సైతం లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ మతపిచ్చి పార్టీ అని, జనాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవడమే ఆ పార్టీకి తెలుసని ధ్వజ మెత్తారు. పీఎం మోదీని సీఎం కేసీఆర్ విమర్శించినంతగా వేరే ఎవరూ విమర్శించలేరని, మాకు ఆ పార్టీతో, మోదీతో ఎలాంటి మిలాఖత్ లేదనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. మోదీది గాడ్సే వారసత్వమని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ అంటే కాళేశ్వరం..
కాంగ్రెస్ అంటే శనీశ్వరం
బీఆర్‌ఎస్ అంటే కాళేశ్వరమని, కాంగ్రెస్ అంటే శనీశ్వరమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మాతాశిశు ఆస్పత్రితోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. నరేంద్రమోదీ అంటే నమ్మించి మోసం చేసేవాడని విమర్శించారు. కాగా జగిత్యాల జిల్లాకేంద్రంలో నిర్మించిన జిల్లా పోలీసు ప్రధాన కార్యా లయాన్ని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి హోంమంత్రి మహమూద్‌అలీ ప్రారంభించారు.
ఒక్క రూపాయి లంచం లేకుండా..
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్ 577 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు, 1,747 మందికి గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా ప్రజలకు లబ్ధి కలిగే విధంగా కేసీఆర్ పాలన వర్ధిల్లుతోందన్నారు.
మోదీ అబద్ధాల జాతర
ఎక్స్(ట్విట్టర్)లో మంత్రి కేటీఆర్ ధ్వజం
పీఎం నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలనే కాకుండా 140 కోట్ల మంది భారతీయులను మోసం చేశారని మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ధ్వజమెత్తారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి విభజన హామీలకు దిక్కులేకుండా పోయిందని ఆరోపించారు. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి వస్తున్న మోదీ విభజన హామీలకు పదేళ్లుగా పాతరేసి అబద్ధాల జాతర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వంద స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment