సాక్షి, హైదరాబాద్: ఆగష్టు 10వ తేదీతో గృహలక్ష్మి పథకం గడువు ముగుస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పందించింది. అలాగే.. దరఖాస్తుల స్వీకరణకు రకరకాల పేపర్లు అడుగుతూ కొర్రీలు పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలపైనా స్పందించింది. గృహలక్ష్మి పథకం అనేది తెలంగాణలో కొనసాగే నిరంతర ప్రక్రియ అని, కాబట్టి దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైన ప్రకటన చేసింది.
ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సొంత జాగా ఉండి.. ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రభుత్వం డెడ్ లైన్ విధించిందని, అర్హులైన వారు ఈనెల 10వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిందని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దరఖాస్తు విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.
‘‘గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పంపించవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత.. రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు అని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.
గృహలక్ష్మి పథకం విషయంలో.. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారాయన.
గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ
— BRS Party (@BRSparty) August 9, 2023
- దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి… pic.twitter.com/yLp0zgYM0s
మార్గదర్శకాలు ఇవే..
► ఈ పథకం కింద 100 శాతం రాయితీతో ప్రభుత్వం రూ. 3 లక్షల ఈ ఆర్థిక సాయం అందించనుంది.
► రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మెుత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందిస్తారు.
► మహిళల పేరు మీదే ఆర్థిక సాయం అందిస్తారు.
► లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి (జన్‌ధన్ ఖాతాను వినియోగించవద్దు) .
► కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు.
► ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది.
► ఇప్పటికే ఆర్‌సీసీ (RCC) ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వులు కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు.
► ఈ పథకం కింద ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment