
ఒడిశాలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు వివిధ పదవులకు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్‌కు అంజేశారు.
ఎమ్మెల్యే పాణిగ్రాహి గత 25 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగారు. ఆయన త్వరలోనే బీజేడీలో చేరనున్నారని విశ్వసనీయ సమాచారం. ఖాడియాల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో చర్చించిన తర్వాతనే తాను కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నానని అధిరాజ్ మీడియాకు తెలిపారు. ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. అయితే ఆయన బీజేడీలో చేరుతారంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయనకు 59,308 ఓట్లు వచ్చాయి. బీజేడీ నేత లంబోధర్ నియాల్‌కు 56,451 ఓట్లు వచ్చాయి. 2014లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి పాణిగ్రాహి ఓటమి చవిచూశారు.