టీడీపీలో ఏం జరుగుతోంది.. రగిలిపోతున్న నేతలు! | TDP Dalit Supporters Serious Over Chandrababu and Lokesh | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఏం జరుగుతోంది.. రగిలిపోతున్న నేతలు!

Published Sun, Jan 28 2024 6:59 PM | Last Updated on Mon, Feb 5 2024 4:28 PM

TDP Dalit Supporters Serious Over Chandrababu and Lokesh - Sakshi

తెలుగుదేశం పార్టీలో దళిత నేతల పరిస్థితి దయనీయంగా మారింది. ఎమ్మెల్యే సీటు అడిగితే అవమానాలు ఎదురవుతున్నాయి. ఎంత పెద్ద సీనియర్ లీడర్ అయినా చంద్రబాబు కాళ్లు పట్టుకోవాల్సిందే అంటున్నారు. కమ్మనేతల కనుసన్నల్లో మెలిగితేనే సీటు ఇస్తామంటున్నారట. చంద్రబాబు, లోకేష్ అసలు సీనియర్ నేతలకు కనీసం అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారని టీడీపీలోని దళిత నేతలంతా మండిపడుతున్నారు. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది?..

తెలుగుదేశం పార్టీలో సీనియర్ దళిత నేతలు పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలకు సీట్లు అడిగితే సీటివ్వకపోగా, అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా.. అవమానాలకు గురిచేస్తున్నారని మదనపడుతున్నారు. మాజీ దళిత మంత్రులతో కాళ్లు మొక్కించుకుని చంద్రబాబు దళితులను హీనాతి హీనంగా చూస్తున్నారని టీడీపీలోని దళిత నేతలంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి జవహార్ ఎన్నికల్లో తన సీటు కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకుని వేడుకోవాల్సి వచ్చింది. చంద్రబాబుతో మాట్లాడటానికి ఎన్ని సార్లు అపాయింట్‌మెంట్ కోరినా జవహర్‌కి దక్కలేదు. చివరికి ఇటీవల విజయవాడ వచ్చిన చంద్రబాబుకి ఎయిర్‌పోర్ట్‌లో ఎదురు వెళ్లి కాళ్లకి మొక్కారు జవహార్. 

జవహర్ పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు సీటు ఆశిస్తున్నారు. గతంలో అక్కడి నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. జవహార్‌కి కొవ్వూరు సీటు రాకుండా అక్కడి కమ్మ నేతలు అడ్డుకుంటున్నారు. కమ్మ నాయకులకు అణిగిమణిగి ఉన్నవారికే ఇక్కడ సీటు ఇప్పిస్తామని టీడీపీ నేతలు ఓపెన్‌గానే చెబుతున్నారు. మాజీ మంత్రి అయినా సరే, దళితుడిని కాబట్టి కాళ్లు పట్టుకుని అడిగినా కూడా సీటు ఇవ్వకుండా అవమానిస్తున్నారని జవహర్ తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఓ వైపు జవహర్ కాళ్లు పట్టుకుని మొక్కిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన మరో దళిత మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఇటీవల ఇదే అంశాన్ని బయటపెట్టారు. చంద్రబాబు, ఆయన సామాజికవర్గం నాయకులు దళితుల మీద పెత్తనం చేస్తారని, చంద్రబాబు కేవలం తన సామాజికవర్గ నేతలకే మద్దతిస్తారని మండిపడ్డారు.

చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన పీతల సుజాత పరిస్థితి కూడా అంతే. పీతల సుజాత చింతలపూడి సీటు ఆశిస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమెకు ఇప్పుడు చింతలపూడి సీటు రాకుండా మళ్లీ కమ్మ నేతలే అడ్డుపడుతున్నారని ఆమె వర్గీయులు రగిలిపోతున్నారు. దళితులకు ఎందుకు రాజకీయాలని ఓపెన్‌గానే చెప్పిన చింతమనేని ప్రభాకర్ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తన చెప్పు చేతుల్లో ఉండేవాళ్లే కావాలని పట్టుబడుతున్నారు. పీతల సుజాత తన మాట విననందుకే టిక్కెట్ రాకుండా చింతమనేని అడ్డుకున్నాడు. అలానే ఈ జిల్లాలోని మరో కమ్మనేత మాగంటి బాబు కూడా ఈ నియోజకవర్గంలో దళిత అభ్యర్థి ఎవరైనా తాము చెప్పిన చోట సంతకాలు పెట్టేవాళ్లై ఉండాలని ఓపెన్‌గానే  కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు కమ్మ నేతలు చింతలపూడిలో దళిత అభ్యర్థి తమ చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తే కావాలని పట్టుబడుతున్నారు.

ఇందుకోసం ప్రకాశం జిల్లా నుండి సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ సోదరుడు అనిల్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అనిల్ కుమార్ అయితే కమ్మ సామాజికవర్గం చెప్పుచేతల్లో ఉంటారని ఆయన పేరును చంద్రబాబుకి సూచిస్తున్నారు. అసలు చింతలపూడితో ఎలాంటి సంబంధం లేని చింతమనేని ప్రభాకర్ ఇక్కడి దళిత అభ్యర్థిపై పెత్తనం సాగించాలని చూడటం ఏంటని టీడీపీ దళిత నేతలు రగిలిపోతున్నారు. మాజీ మంత్రి పీతల సుజాతకి టిక్కెట్ విషయంలో చంద్రబాబు, లోకేష్ స్పష్టత ఇవ్వడం లేదు. డబ్బున్న వాళ్లు, కమ్మ సామాజికవర్గం చెప్పు చేతల్లో ఉన్న వాళ్లయితేనే చంద్రబాబు, లోకేష్ సీట్లు ఇస్తామంటున్నారని దళిత నేతలు ఆగ్రహిస్తున్నారు.

గోపాలపురంలో కూడా అభ్యర్థి విషయంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. గోపాలపురంలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా మద్దిపాటి వెంకటరాజుని గతంలో చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ ఆఫీస్‌లో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్‌గా గతంలో పనిచేసిన మద్దిపాటి వెంకటరాజు చంద్రబాబు, లోకేష్ దగ్గర పైరవీ చేసి ఇన్‌ఛార్జ్ పదవి తెచ్చుకున్నారు. తానైతే కమ్మనేతల చెప్పుచేతల్లో ఉంటానని సీటు తనకే ఇవ్వాలని అడుగుతున్నారట. అయితే, ఈ నియోజకవర్గంలో మద్దిపాటి వెంకటరాజు ఇన్‌ఛార్జ్‌గా వచ్చినప్పటి నుండి టీడీపీ నాయకులంతా తిరుగుబాటు ప్రకటించారు. ఇటీవలే పెద్ద ఎత్తున మంగళగిరికి ర్యాలీ చేసి వెంకటరాజుకి సీటు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఇక్కడున్న ముప్పిడి వెంకటేశ్వరరావు సీటు తనకే ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు మరో కమ్మ నేత, మాజీ జడ్పీ ఛైర్మన్ బాపిరాజు.. గోపాలపురం సీటు తాను చెప్పిన వారికి ఇవ్వాలని, వెంకటరాజుకి ఇవ్వడానికి వీల్లేదని పట్టుబడుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఫుల్ జోష్ మీదుంది. కానీ, టీడీపీ దళిత నేతలకు మాత్రం కాళ్లు పట్టుకుంటున్నా కనికరించకుండా అవమానిస్తున్నారని దళిత నేతలు రగిలిపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement