దేశంలో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఎన్నికలు ప్రజాస్వామ్య పండులని అంటుంటారు. దేశంలో 1957లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను ఇప్పటికీ ఏదోవిధంగా గుర్తుకు తెచ్చుకుంటారు.
దేశంలో 1957లో రెండో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలు వింత వైనాలు చోటుచేసుకున్నాయి. నాడు జన్‌సంఘ్ నేతగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఒక ప్లాన్ చేశారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి 1957 లోక్‌సభ ఎన్నికల్లో మథుర, బల్‌రాంపూర్, లక్నో ఈ మూడు చోట్ల నుంచి పోటీ చేశారు. బలరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఐదుసార్లు ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు.
వాజ్‌పేయి తొలిసారిగా మధుర లోక్‌సభలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. నాడు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన కారణంగానే అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ఓటమిని తనకు తానుగా ఆహ్వానించుకున్నారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటారు.
ఈ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి బహిరంగ సభలకు వెళ్లినప్పుడు ప్రత్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసేవారు. తనకు కాకుండా రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్‌కు ఓటువేయాలని కోరేవారు. ఇలా తాను వెళ్లిన ప్రతీచోటా ప్రత్యర్థికి ఓటు వేయాలని కోరారట. ఎవరైనా అదేమిటని అడిగితే ఆయన తన లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కాదని, కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని నిర్ధారించడమేనని చెప్పుకొచ్చేవారు.
నాటి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాజ మహేంద్ర ప్రతాప్ విజయం సాధించారు. ఆయనకు 95 వేల 202 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దిగంబర్ సింగ్ 69 వేల 209 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. జనసంఘ్‌కు చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయి నాలుగో స్థానంలో నిలిచారు. వాజ్‌పేయికి కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment