సాక్షి, అమరావతి: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా వాద్రా ర్యాలీలో టీడీపీ నాయకులు జెండాలు పట్టుకుతిరగడం సిగ్గుచేటని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
విలువల్లేని రాజకీయాలకు చంద్రబాబు, పురందేశ్వరి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారన్నారు. తొమ్మిది షిప్పింగ్ హార్బర్లు, నాలుగు పోర్టులు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, కడప కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ పార్క్, కర్నూల్ గ్రీన్‌కో పవర్ ప్లాంట్, వైజాగ్ ఐటీ అభివృద్ధి, మూడు ఐటీ సెజ్‌లు, నెల్లూరు క్రిస్ సిటీ, 2.5 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటుతో అభివృద్ధి వికేంద్రీకరణ, విస్తరణ మునుపెన్నడూ లేనిరీతిలో కనిపిస్తోందన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం..
ఇక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటవుతున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ప్రచార ఆర్భాటాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో రూ.2,400 కోట్ల విలువైన పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశామని.. రూ.550 కోట్లతో నంద్యాలలో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్, రూ.402 కోట్లతో ఐదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, రూ.800 కోట్లతో ఇంధన రంగంలో రెండు యూనిట్లకు శంకుస్థాపన చేయగా, రూ.230 కోట్లతో నెల్లూరులో గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఉత్పత్తికి సిద్ధమైందన్నారు. ప్రతి 15 రోజులకోసారి రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై సమీక్షిస్తూ అనుమతులను వేగంగా మంజూరు చేస్తోందని విజయసాయిరెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment