పీఆర్సీ ఊసేది.. ఓపీఎస్ సంగతేంది?
●
● ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రఘునాథరెడ్డి
ఒంగోలు: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని ఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునారెడ్డి అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు కె.యర్రయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన జిల్లా తృతీయకార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీ పీఎఫ్, ఏపీ జీఎల్‌ఐ, సరెండర్ లీవ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ తదితర బిల్లుల చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని ఖండించారు. 11వ పీఆర్సీ, డీఏ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ జీతాల నుంచి ప్రతి నెలా కొంత మినహాయించి, వారి ఖాతాల్లో పొదుపు చేసుకున్న సొమ్మును కూడా నెలల తరబడి చెల్లించకుండా, ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. స్పందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం బాధాకరమన్నారు. రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పి.రమణారెడ్డి, బి.వెంగళరెడ్డి, చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిల విషయంలో సవతితల్లి ప్రేమ కనపరుస్తున్నారన్నారు. వెంటనే సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను చెల్లించాలన్నారు. సకాలంలో డబ్బులు అందక వివాహాలు వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పదవీ విరమణ తరువాత అర్థవేతన సెలవుల నగదును చెల్లించకపోవడం అన్యాయమన్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను రకరకాల కారణాలతో పెండెంగ్‌లో పెట్టడం సరికాదన్నారు. 12వ పీఆర్సీ అమలులో జాప్యం కారణంగా వెంటనే 30శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. జీఓ నం.117ను రద్దు చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, ఏ ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. కేజీబీవీ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఎంటీఎస్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ చివరిలోగా పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణకు పిలుపునిస్తామన్నారు. ఎస్టీయూ కేవలం ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలోనే కాకుండా సామాజిక సేవ, మోడల్ టెట్, డీఎస్సీ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం మహాత్మా గాందీ, లాల్ బహుదర్ శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి జి.నరసింహారెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి డి.నాగయ్య, జిల్లాకార్యవర్గ సభ్యులు మౌలాలి, సిద్ధిక్, కోటేశ్వరరావు, నభీఖాన్, రామచంద్రారెడ్డి, కోటాచారి, వెంకటేశ్వర్లు, మల్లేశ్వరి, మాల్యాద్రి, గాలెయ్య, రంగారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment