భూ దందా మళ్లీ మొదలైంది..!
కురిచేడు: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమో గానీ..అక్రమార్కులకు మాత్రం పండగే. 2014–2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని లక్షలు గడించిన అక్రమార్కులు..ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగారు. రెవెన్యూ అధికారుల అండతో ప్రభుత్వ భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారు.
గద్దల్లా తన్నుకుపోవడమే..
2014–19 మధ్యకాలంలో మండలంలోని కల్లూరు రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 272, పెద్దవరం గ్రామ సర్వేనంబర్ 306లతో పాటు కురిచేడులోని రెవెన్యూ ఫారెస్టు వివాదాస్పద భూమి సర్వే నంబర్ 8లో ఎక్కువగా ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని తిరిగి అమ్మకాలు కూడా చేస్తూ యథేచ్ఛగా సొమ్ము చేసుకున్నారు. అయితే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019–24లో భూ ఆక్రమణలు ఆగిపోయాయి. రీ సర్వే చేస్తే ప్రభుత్వ భూములు బయటపడతాయన్న భయంతో ఆ భూములు కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆక్రమణదారులు జులుం విధిస్తున్నారు. దీంతో తిరిగి ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. కల్లూరు సర్వేనంబరు 272 లో 432.98 ఎకరాల భూమి ఉంది. దానిలో 137 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. మిగతా భూమి కూడా ఎవరికి వారు ఆక్రమణలు చేసుకుంటూ గొడవలు పడి కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. అలాగే పెద్దవరం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 306 లో 630 ఎకరాలు భూమి వుంది. దాన్ని ఆక్రమిస్తుండటంతో అధికారులు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకొని బోర్డులు పెట్టినా తిరిగి ఆక్రమణలు చేయటం పరిపాటైంది. మండలంలోని పడమరవీరాయపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 8లో 575 ఎకరాల భూమి ఉంది. దానితో పాటు అటవీప్రాంతంలో ముష్టిగంగవరం, పడమరనాయుడుపాలెం, ఆవులమంద జగన్నాథపురం రెవెన్యూ గ్రామాల పరిధిలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఆక్రమించిన భూములలో బోర్లువేసి విద్యుత్ మోటార్లు, సోలార్‌ప్యానల్లు బిగించి సాగుచేసుకుంటున్నారు. ఆక్రమించిన భూములకు విద్యుత్ శాఖ ఏ విధంగా కనెక్షన్ ఇస్తుందో అర్థం కాని పరిస్థితి. రెవెన్యూ అధికారులు కూడా ఆక్రమణలను పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. అధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకుంటే లక్షల విలువైన ప్రభుత్వ భూములు పరులపాలయ్యే అవకాశాలు ఉన్నాయి.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి
రావడంతో రంగంలోకి అక్రమార్కులు
వందల ఎకరాల ప్రభుత్వ భూములు
ఆక్రమణ, క్రయవిక్రయాలు
పుష్కలంగా రెవెన్యూ అధికారుల
అండదండలు
Comments
Please login to add a commentAdd a comment