భార్యను కాపురానికి పంపలేదని..
పెద్దదోర్నాల: భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో అత్తా మామలపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చింతల గిరిజన గూడెంలో మంగళవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో చింతలగూడేనికి చెందిన భార్యాభర్తలు భూమని నాగన్న, వెంకటమ్మ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. గూడేనికి చెందిన భూమని నాగన్న, వెంకటమ్మ కుమార్తెను కుడుముల హనుమయ్యకు ఇచ్చి వివాహం చేశారు. అయితే కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య ఽకొద్దిపాటి మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హనుమయ్య భార్య తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. మంగళవారం జరిగిన చిన్నపాటి వాగ్వాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో తన భార్యను తనతో పంపమని హనుమయ్య తన అత్తా మామలపై కత్తితో దాడికి దిగడంతో భూమని నాగన్న, వెంకటమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై మహేష్ కేసు నమోదు చేసుకొని ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
అత్తామామలపై అల్లుడి దాడి అత్త పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment