రాష్ట్రం రావణకాష్టంలా మారింది
సాక్షి ప్రతినిధి ఒంగోలు: రాష్ట్రం రావణకాష్టంలా మారిందని, ఇందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే నిదర్శనమని ప్రకాశం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వారు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యపై నిన్ననే ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారన్నారు. ‘‘కూటమిలో ఉపముఖ్యమంత్రిగా ఉండి బయట తిరుగుతుంటే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఈ రాష్ట్రం చాలా దారుణంగా ఉందని, అరాచకంగా ఉందని, మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయని’’పవన్ ఒప్పుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఎమ్మెల్యే ప్రజల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉందని విమర్శించారు. ఏ ఒక్క ఇంటికై నా వెళ్లి మేము ఇది చేశాం అని చెప్పుకునే దమ్ము, ధైర్యం అధికారపార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. వాళ్ల కార్యకర్తలు కూడా సిగ్గుపడుతున్నారని, పవన్‌కళ్యాణ్ సైతం నిన్న ఇవే మాటలు అన్నారని కారుమూరి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో గడప గడపకు వెళ్లి పథకాల గురించి వివరించామని, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారంటే అది జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ధైర్యం అని అన్నారు. మేము ఓడిపోయే పరిస్థితి లేదు.. ఏదో జరిగిందని మా నాయకుడే చెప్పారని, సాక్ష్యాలు లేవు కాబట్టి చెప్పలేక పోతున్నాను, మాకు జరగాల్సింది కాదన్నారు. మిషన్ల మీద పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ ఇలా అవడంపై పవన్ హోంమినిస్టర్‌ను తప్పు పట్టడం చూస్తుంటే పలు అనుమానాలు వస్తున్నాయన్నారు. అసలు లా అండ్ ఆర్డర్ చంద్రబాబు వద్ద ఉంటుందని, దీనికి బాధ్యత చంద్రబాబే వహించాలన్నారు. రాష్ట్రంలో 55 మంది రెగ్యులర్ డీఎస్పీలు, 23 ట్రైనీ డీఎస్పీలు, 50 ఏఎస్పీలు, ఏ డివిజన్‌లో చూసినా 20 లేదా 30 ఖాళీలు ఉన్నాయన్నారు. వీరిని ఎందుకు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదన్నారు. ఇన్ని రకాల అరాచకాలు జరుగుతుంటే మీరు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఖాళీలు పూర్తి చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లోకి తెచ్చుకోండన్నారు.
ఐదు నెలలుగా అరాచక పాలన:
ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ఐదు నెలలుగా రాష్ట్రంలో అరాచకపాలన కనిపిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారిని అరెస్ట్‌లు చేయడం వంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య విధానాలు కొనసాగని ప్రభుత్వం అని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయనీ, పిల్లల్ని బడికి పంపితే తిరిగి ఇంటికి వచ్చే వరకు భయంతో అభద్రతతో తల్లిదండ్రులు ఉంటున్నారన్నారు. వీధి, వీధికీ బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని చెప్పారు. కూల్‌డ్రింక్ దొరికినంత సులభంగా మద్యం దొరుకుతుందని ఎద్దేవా చేశారు. అది కూడా దాడులకు కారణమవుతోందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో బెల్ట్‌షాపులు లేని రాష్ట్రంగా ఏపీ తయారైతే, నేడు వీధివీధిలో బెల్ట్‌షాపు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానమే ఉద్యమాలు, పోరాటాలతో ప్రారంభమైందని, పోరాటాలు కొత్తేమీకాదన్నారు. నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పోరాడటానికి సిద్ధంగా ఉండాలన్నారు.
నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటాం..
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లాలోని 8 సీట్లకు 8 సీట్లు కై వసం చేసుకునేలా, కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండి కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా కార్యకర్తలపై దాడులు, ఆక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని విమర్శించారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు బుర్రా మధుసూదన్ యాదవ్, అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, అద్దంకి ఇన్‌చార్జ్ పాణెం హనిమిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కాకుమాను రాజశేఖర్, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనకారావు మాదిగ, బీసీ నాయకుడు బొట్ల రామారావు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ వై.ఎం.ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment