మెడికల్ కళాశాల కథ కంచికే..!
మార్కాపురం: సరైన వైద్యసేవలందక చిన్నపాటి రోగానికి పొరుగు జిల్లాలకు వెళ్లి అవస్థలు పడుతున్న పశ్చిమ ప్రకాశం వాసులకు మెరుగైన వైద్యసేవలందించే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడమే కాకుండా వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. రూ.475 కోట్లతో మార్కాపురం మండలం రాయవరం వద్ద కళాశాల నిర్మించే దిశగా చర్యలు చేపట్టారు. 75 శాతం పనులు ఎన్నికల నాటికి పూర్తయ్యాయి. 150 మెడికల్ సీట్లను భర్తీ చేయాలన్న లక్ష్యానికి అనుకూలంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయి క్లాసులు ప్రారంభించాల్సి ఉంది. అలాగే మార్కాపురం జిల్లా వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చి 100 నుంచి 500 పడకల స్థాయికి పెంచి 75 మంది వైద్య నిపుణులను నియమించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. నీట్‌లో కూడా మార్కాపురం మెడికల్ కాలేజీని చేర్చలేదు. ఎంబీబీఎస్ సీట్లు రాకుండా అడ్డుకుంది. నిర్మాణ పనులను నిలిపేసింది. 140 రోజుల నుంచి కాలేజి నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో పాటు కళాశాల ప్రిన్సిపల్, జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను, 30 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఇటీవలే కౌన్సెలింగ్ నిర్వహించి ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం తదితర మెడికల్ కాలేజీలకు బదిలీ చేసింది. మిగిలిన వైద్య నిపుణులను కూడా త్వరలో కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేయనుంది. దీంతో మెడికల్ కాలేజి నిర్మాణం లేనట్టేనని భావించిన నిర్మాణ సంస్థ కళాశాలలో ఉన్న ఇనుము, సిమెంట్ ఇతర సామగ్రిని మంగళవారం నుంచి లారీలలో తరలించే ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈ ప్రాంత ప్రజల కల కలగా మారింది. కూటమి ప్రభుత్వ నిర్ణయం పశ్చిమ ప్రాంత ప్రజలకు శాపమైంది. మెడికల్ కాలేజి తరలిపోతున్నా కూటమి ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రొఫెసర్ల బదిలీలు ఆగిన నిర్మాణ పనులు మెడికల్ కాలేజిలో సామగ్రి తరలింపు
Comments
Please login to add a commentAdd a comment