ప్రజా సమస్యలు పునరావృతం కాకూడదు
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీల సమస్యలు పునరావృతం కాకుండా చిత్తశుద్ధితో క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు డివిజన్ సబ్‌కలెక్టర్, ఆర్డీవోలు పర్యవేక్షించాలన్నారు. గ్రీవెన్స్ హాలులో మంగళవారం ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రీవెన్స్ అర్జీలు పరిష్కరిస్తున్న తీరుపై ఆడిట్ జరుగుతుందన్నారు. వచ్చిన ప్రతి అర్జీని నిర్దేశిత సమయంలో సహేతుకంగా పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా పనిచేయాలన్నారు.
జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ అర్జీల పరిష్కారం కోసం గడువు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వేగంగా పరిష్కరించాలన్నారు. సాగునీటి సంఘాలకు ఎన్నికలు ఉన్నందున నీటి వనరులు కబ్జాకు గురికాకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ చిన ఓబులేసు, డీఎస్‌ఓ పద్మశ్రీ, ఆర్‌డీవో లక్ష్మీప్రసన్న, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు, కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment