సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గ్రామ వలంటీర్ వ్యవస్థపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఇప్పటి వరకు రోజుకో మాట చెబుతూ వస్తున్నారు. వలంటీరు వ్యవస్థను రద్దు చేయం అంటూ చెప్పుకొచ్చిన మంత్రి తాజాగా మాట మార్చేశారు. శాసన మండలి వేదికగా అసలు ఈ వ్యవస్థ ఉండదంటూ ప్రకటన చేయడం సంచలనంగా మారింది.
నాడు అలా..
గతంలో మంత్రిగా స్వామి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా వల్లూరమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. అలాగే పలు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ‘‘గ్రామ వలంటీర్లను కొనసాగిస్తాం... నా వాట్సప్ మెసేజ్‌లతో నిండిపోయింది. వైఎస్సార్‌సీపీ నాయకులు బలవంతంగా వలంటీర్ల చేత రాజీనామా చేయించారు. ప్రస్తుతం ఉన్న వలంటీర్లతో పనిచేయించుకుంటాం. వలంటీర్లకు ఇచ్చిన మాటకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వలంటీర్ వ్యసస్థ రద్దు చేస్తారనడం అవాస్తవం. ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తే సహించేది లేదు’’ అని మంత్రి స్వామి ఆనాడు ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సైతం ఇదే విధమైన ప్రకటనలు చేశారు కూడా.
నేడు ఇలా..
తాజాగా మంత్రి స్వామి మాట్లాడుతూ వలంటీర్ వ్యవస్థ అనేది ఉంటే కొనసాగించేవాళ్లం. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తాం. పిల్లాడికి పేరు పెట్టలేదు అంటే లేని పిల్లాడికి పేరు ఎలా పెట్టాలి అన్నట్లుంది వలంటీర్ వ్యవస్థ తీరు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023 ఆగస్టు వరకు వలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు జీఓ ఇచ్చింది. తరువాత వలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు జీఓ ఇవ్వలేదు. అని శానసమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి స్వామి సమాధానమిచ్చారు.
అనుకున్నదే జరిగింది
గ్రామ వలంటీర్ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణితోనే ఉందని కొండపి నియోజకవర్గ వలంటీర్ల సంఘం అధ్యక్షుడు పిల్లిపోగు జీవన్‌కుమార్ అన్నారు. ఎన్నికల సమయంలో రూ.10 వేల జీతం ఇస్తామని చంద్రబాబు దగ్గర నుంచి అందరూ మాయమాటలు చెప్పారని, గెలిచిన తరువాత కూడా పలువురు మంత్రులు వలంటీర్లను కొనసాగిస్తాం అంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారన్నారు.. మంత్రి డోల ఒక అడుగు ముందుకేసి జిల్లాలో, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటూ ప్రకటనలు చేశారని తెలిపారు. ఇప్పుడేమో జీఓ లేదు... వలంటీర్ వ్యవస్థ లేదు.. లేని బిడ్డకు పేరు ఎలా పెడతాం అని డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తున్నట్లు జీఓ జారీ చేయవచ్చుగదా అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment