కుంట స్థలంలో హద్దురాళ్ల తొలగింపు
సింగరాయకొండ: మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ బకరాల గుంట స్థలం ఆక్రమణపై ఈనెల 18వ తేదీ సోమవారం ‘కుంటను మింగిన ఘనులు’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. కోట్లాది రూపాయల విలువైన బకరాల గుంటకు చెందిన సుమారు 3 ఎకరాల స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేసేందుకు ప్రయత్నించి అందులో ఒక్కొక్కటి 2.50 సెంటు చొప్పున 60 ప్లాట్లు వేశారు. దీనిపై ప్రచురితమైన కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో ఉన్న హద్దురాళ్లను పూర్తిగా తొలగించారు.
పోలీసు కానిస్టేబుల్ పై దాడి
ఒంగోలు టౌన్: మద్యం మత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు పోలీసు కానిస్టేబుల్ పై దాడి చేసి కొట్టడం సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం... తాలూకా పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు పై స్థానిక శివ ప్రసాద్ కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్ ట్రావెల్స్ యజమాని బోడపాటి రాంబాబు అసభ్యంగా తిడుతూ దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ శ్రీనివాసరావు ముంగమూరు రోడ్డులో ఇండియన్ గ్యాస్ మూలమీద ఉన్న ఒక కాకా హోటల్లో మంగళవారం రాత్రి టిఫిన్ చేస్తున్నాడు. అతడి మోటారు బైకును రోడ్డు పక్కన నిలబెట్టాడు. అప్పుడే అటుగా కారులో వెళుతున్న రాంబాబు రోడ్డుకు అడ్డంగా ఉన్న బైకును తీయమన్నాడు. టిఫిన్ చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసరావు లేచి వెళ్లి బైకును తీశాడు. అంతటితో సంతృప్తి చెందని రాంబాబు ‘‘ఏరా.. ఈ రోడ్డు నీ అబ్బ సొమ్మనుకున్నావా నా..’’ అంటూ తిట్టడం మొదలెట్టాడు. కారు దిగి వచ్చి కానిస్టేబుల్ మీద దాడికి దిగాడు. ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. దాడి చేస్తున్న రాంబాబును కానిస్టేబుల్ శ్రీనివాసరావు పట్టుకోగా అతడి చేతిని కొరికాడు. కానిస్టేబుల్ నుంచి విడిపించుకొని కారు ఎక్కి వెళుతుండగా శ్రీనివాసరావు అడ్డుగా నిలుచున్నాడు. అయినప్పటికీ అతడిని రాసుకుంటూ కారులో వేగంగా వెళ్లిపోయాడు. శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు అర్ధరాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు ఎమ్మెల్యే జనార్దన్ ఫోన్...
కానిస్టేబుల్ మీద దాడి చేసిన రాంబాబు పై కేసు పెట్టవద్దంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తాలూకా పోలీసులకు ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాంబాబు పరారీలో ఉన్నాడు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి వున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment