ఆక్రమణల తొలగింపు పునః ప్రారంభం
మార్కాపురం:
మార్కాపురం పట్టణంలో శనివారం నుంచి ఆక్రమణల తొలగింపు పునఃప్రారంభమైంది. 2 వారాల క్రితం కళాశాల రోడ్డు, కంభం రోడ్డు, కోర్టు సెంటరు వరకూ మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కాలువల వరకూ, కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఆ తరువాత తొలగింపు ప్రక్రియ నిలిపేశారు. దీంతో అందరూ ఆక్రమణల తొలగింపు మిగిలిన బజారుల్లో లేనట్టేనని భావించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, సీఐ సుబ్బారావు, ఎస్సైలు సైదుబాబు, రాజమోహన్‌రావు, అంకమరావు తదితరులు తమ సిబ్బందితో వచ్చి పార్కు ఎదురుగా ఉన్న మెయిన్‌బజారు నుంచి జేసీబీలతో కాలువలపై ఉన్న ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. దీనితో అమ్మవారిశాల బజారులో ఉన్న ఆయా షాపుల యజమానులు కొంతమంది హడావుడిగా తమ షాపు ముందుభాగాన ఉన్న రేకులు, మెట్లు తొలగించుకోగా మిగిలిన వాటిని మున్సిపల్ అధికారులు తొలగించారు. తేరు బజారు, నాయుడు వీధిలో కూడా మున్సిపల్ కాలువలపై ఉన్న ఆక్రమణల వరకూ అధికారులు తొలగించారు. ఈ పరిస్థితుల్లో పలువురు చిరువ్యాపారులు అధికారుల వద్దకు వచ్చి తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని కోరారు. లేదంటే తమ కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మూడురోజుల సమయం ఇవ్వండి:
మార్కాపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్రమ ణల తొలగింపునకు మూడు రోజులు సమయం ఇవ్వాలని ఆయా వ్యాపార సంస్థల నిర్వాహకులు, భవన యజమానులు ఏవైనా ఆక్రమణలు ఉంటే తొలగించుకుంటారని మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆక్రమణలు ప్రారంభం కాగానే ఆయన అక్కడికి వచ్చి మూడు రోజుల సమయం ఇస్తే వ్యాపారులే ఏవైనా ఆక్రమణలు ఉంటే తీసేస్తారని, అప్పటికీ తొలగించకుంటే ఆక్రమణలను భావిస్తే మీరు తొలగించాలని అన్నారు. ఏయే ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగిస్తారో మార్కింగ్ ఇవ్వాలని చైర్మన్ కోరారు.
స్వచ్ఛందంగా తొలగించుకోండి :
నారాయణరావు, కమిషనర్
మార్కాపురం పట్టణ పరిధిలో మున్సిపల్ కాలువల వరకూ, కాలువలపై ఉన్న ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేదంటే తమ సిబ్బంది యంత్రాల సాయంతో తొలగిస్తారని కమిషనర్ నారాయణరావు హెచ్చరించారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా తొలగించుకుంటే షాపుల్లో, షాపుల బయట ఉన్న వస్తువులు సురక్షితంగా ఉంటాయని, జేసీబీతో తొలగిస్తే ఇబ్బందులు పడతారని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment