ఆరు నెలల్లోనే పిల్లిమొగ్గలు
దర్శి: కేంద్రంలో అధికారం ఉండి కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేక ఆరు నెలల్లో చంద్రబాబు పిల్లి మొగ్గలు వేస్తున్నారని ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పని మడమ తిప్పని ఒకే ఒక్క సీఎంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశ చరిత్రలో నిలిచారని చెప్పారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకులుతో సమావేశం బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కారుమూరి నాగేశ్వరరావు, పార్లమెంట్ పరిశీలకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నా ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో ఎటువంటి పొత్తులు లేకుండానే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని తిరిగేలా పాలించారని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా కూటమి నాయకులు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఉదయం గ్రామాల్లో ప్రోగ్రాంకు వెళ్లాలంటే ఎక్కడ హామీలు అడుగుతారో అని మధ్యాహ్నం వెళ్లి వెంటనే వెనుదిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరు గార్చిందన్నారు. బ్రిటీష్ పాలనకంటే ఈ కూటమి పాలన దుర్మార్గంగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదని ఈవీఎంలు వారిని గెలిపించాయని ఎద్దేవా చేశారు. ఈవీఎం సీఎం చంద్రబాబు, ఈవీఎం ఎమ్మెల్యేలు, మంత్రులను హామీలపై ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అరాచకాలు మీరు కూడా చేయాలని మనకు కూడా నేర్పుతున్నారన్నారు. పిల్లిని గదిలో వేసి కొడితే పులిలా తిరగబడుతుందని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా కూడా అంతేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్నీ అరాచకాలే రాజ్యమేలుతున్నాయని అంతకు అంత అనుభవిస్తారని హెచ్చరించారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ కార్యకర్తలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం అని చెప్పారు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని ఎంతో కష్టపడి గెలిపించారన్నారు. మళ్లీ జరిగే ఎన్నికల్లో మరింత మెజార్టీతో గెలిపించుకునేలా గతంలో కంటే ఇంకా కష్టపడి పార్టీని బలోపేతం చేయాలన్నారు. జగనన్న సీఎంగా ఉన్నప్పుడు అన్నీ పథకాలు అమలు చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదన్నారు. రైతులకు రూ.20 వేలు, అమ్మకు వందనంకు రూ.15 వేలు, మహిళలకు రూ.15 వేలు ఇంకా ఎన్నో పథకాలు ఇస్తామని హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు.
ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబం పై ప్రేమతో తనను ఎమ్మెల్యే చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదన్నారు. గతంలో బొట్లపాలెం ఘటనలో నిరసన తెలపాలని కోరితే కార్యకర్తలు భారీగా స్పందించారని చెప్పారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏకష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. ఇటీవల మహిళలపై అత్యాచారాలు ఎన్నో జరిగాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఆ హామీ అమలు చేయలేదన్నారు. ఉచిత ఇసుక గాలికి వదిలేశారన్నారు. ఉచితం పేరుతో టీడీపీ నాయకులు అడ్డగోలుగా ఇసుకను దోచుకుతింటున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులు ఉంటారని, ప్రతి కార్యకర్తతో మాట్లాడి వారి సాధక బాధలు తెలుసుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, జిల్లా యూత్ అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, రాష్ట సంయుక్త కార్యదర్శి మాజీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, జెడ్పీటీసీలు నుసుం నాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీలు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, మాజీ మండల కన్వీనర్లు కాకర్ల కృష్ణారెడ్డి, సూదిదేవర అంజయ్య, కౌన్సిలర్‌లు మేడం మోహన్‌రెడ్డి, జగన్నాథం మోహన్‌బాబు, తుళ్లూరి బాబురావు, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్‌రెడ్డి, బట్టు రాము, సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీలు వీరగంధం కోటయ్య, ఇత్తడి దేవదానం, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్‌లు కేవీరెడ్డి, షేక్ షకీలా అమీన్ బాషా, మాజీ జేసీఎస్ కన్వీనర్‌లు మేడికొండ జయంతి, బత్తినేని వెంకటేశ్వర్లు, గుంటు పోలయ్య, మాజీ సర్పంచ్‌లు చింతా శ్రీనివాసరెడ్డి, నాయకులు ఐవీ సుబ్బారెడ్డి, బ్రహ్మారెడ్డి, కోరే సుబ్బారావు, నాగలక్ష్మి, పీట్ల నాగేశ్వరరావు, అన్నెం చిరంజీవి, మజ్ఞువలి, అన్నవరపు రవి, జోసఫ్, రమణారెడ్డి, గోను నారాయణరెడ్డి, గోను వెంగళరెడ్డి, ఆంజనేయరెడ్డి, పిచ్చిరెడ్డి, కొడవటి జాన్, గర్నెపూడి సామ్యేల్, పానుగంటి కోటయ్య, గొంది అప్పిరెడ్డి, నరశింహారెడ్డి, వలి, గోగులమూడి లింగారెడ్డి, వెంకటరెడ్డి, అంజిరెడ్డి, వలి, ఖాశీం, వెంకటేశ్వరరెడ్డి, వెన్నపూస పేరిరెడ్డి, డగ్లస్, మరమల మధు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు బాధితురాలిని పరామర్శిస్తే 11 కేసులు పెట్టారు నేను ప్రజల మధ్యలోనే ఉంటా..అరెస్ట్ చేసుకోండి వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
పరామర్శించడానికి వెళ్తే కేసులు పెట్టారు..
వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో దాడికి గురైన బాధిత బాలికను పరామర్శించేందుకు వెళితే పోలీసులు తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీతో సహా 11 సెక్షన్లతో కేసు నమోదు చేశారన్నారని ఆరోపించారు. బాలిక తండ్రి తనకు ఫోన్ చేసి జరిగిన అన్యాయం గురించి చెప్పి అండగా నిలవాలని కోరితే తాను రాత్రి 9 గంటల సమయంలో 80 కిలోమీటర్ల దూరం వెళ్లి పలకరించి ధైర్యం చెప్పి తిరుపతి ఆస్పత్రికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం చేయించామని తెలిపారు. ఎక్కడా బాలిక గురించి ప్రస్తావన కూడా తీసుకురాలేదని చెప్పారు. భయపెట్టి కేసులు పెట్టి లొంగతీసుకోవాలనుకుంటున్నారని అలా భయపడేవారం కాదని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు తన పై 88 కేసులు పెట్టి నెలల తరబడి జైలులో ఉంచారని ఆరోపించారు. జిల్లాలు తిప్పి తనను కొట్టి హింసించారని చెప్పారు. తాను ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోనని ఎప్పుడూ జనంలోనే జనంతోనే ఉంటానని స్పష్టం చేశారు. కావాలంటే అరెస్ట్ కూడా చేసుకోవచ్చన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలకంటే ఎంపీ అభ్యర్థి అయిన తనకు 52 వేల ఓట్లు అధికంగా వచ్చాయని చెప్పారు. తనపై అభిమానం చూపిన నాయకులు, కార్యకర్తలు అభిమానులకు ఏకష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాను బూచేపల్లి కుటుంబ సభ్యుడనేనని, నా తమ్ముడు శివప్రసాద్‌రెడ్డి తో కలసి జిల్లాలో అన్నీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీని గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment