ధర ఎరుపెక్కేనా..
మార్కాపురం:
జిల్లాలోని మిరప రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రెండేళ్లుగా లాభాలు తెచ్చిపెట్టిన మిర్చి సాగుపై రైతులు ఆసక్తి చూపించారు. జిల్లా వ్య్ప్తాంగా సాగు విస్తీర్ణం 75 వేల ఎకరాలు కాగా, ప్రస్తుతం 55,823 ఎకరాల్లో సాగు చేశారు. గత సీజన్‌లో సాధారణ విస్తీర్ణం కంటే అదనంగా 20 వేల ఎకరాలు.. అంటే 95 వేల ఎకరాల్లో పండించారు. మార్కాపురం యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో పండిస్తున్నారు. ముఖ్యంగా రైతులు అధిక దిగుబడులు ఇచ్చే యూఎస్ 341, నంబర్ 5, 5831 తేజలో పలు రకాలు సాగుచేశారు. ఎకరాకు సుమారు రూ.25 నుంచి రూ.30 వేల వరకూ ఖర్చుపెట్టారు. ఎకరాకు సుమారు 10 వేల మొక్కలు నాటారు. కొంతమంది బోర్లకింద కూడా మిర్చి సాగుచేశారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకూ దిగుబడులు రావచ్చని రైతులు భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చి వరకు గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి అమ్మకాలు బాగా సాగాయి. క్వింటా రూ.14 నుంచి రూ.16 వేల వరకు ధర పలికింది. ఈ లెక్కన రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జిల్లాలో పశ్చిమ ప్రకాశంలోనే అత్యధికంగా మిర్చి సాగవుతోంది. డివిజన్ మొత్తం మీద గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సబ్‌డివిజన్ల పరిధిలోని 13 మండలాల్లో సుమారు 41,871 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. ఇప్పటికే మార్కెట్‌లోకి పచ్చిమిర్చి వచ్చింది. రెండు మూడు వారాల తర్వాత ఎండుమిర్చి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
తెగుళ్లపై అధికారుల సూచనలు...
ప్రస్తుతం జిల్లాలో సాగవుతున్న మిర్చిలో అక్కడక్కడా కొమ్మ ఎండు, కాయకుళ్లు తెగులు కనిపిస్తోంది. రైతులు ఈ తెగులు సోకిన చెట్టు ప్రతి భాగాన్ని టెబుకొనజోల్ ఒక మి.లీ.ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మబ్బులతో కూడిన వాతావరణం, గాలిలో అధిక తేమశాతం ఉన్న ప్రాంతాల్లో కానోఫొరాబ్‌లైట్ తెగులు వస్తుంది. ఇది కాండం కుళ్లేలా చేస్తుంది. నివారణకు పైరాక్ల్రోస్టెబిన్, మేటీరామ్ 3 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తామరపురుగు సోకినట్లయితే ఇది రసం పీల్చుతుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు ఎర్రగా మారడం, చెట్టు పెరుగుదల తగ్గుతుంది. నివారణకు ఎసిటామీప్రిడ్ 0.2 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నర్సరీలు ఇలా...
జిల్లాలో మొత్తం 205 నర్సరీలు ఉండగా పశ్చిమ ప్రకాశంలోనే 160 నర్సరీలు ఉన్నాయి. ఇందులో బేస్తవారిపేటలో 25, కొమరోలులో 27, మార్కాపురంలో 6, పుల్లలచెరువులో 15, పెద్దారవీడులో 20, త్రిపురాంతకంలో 19, యర్రగొండపాలెంలో 9, గిద్దలూరులో 13, కంభం 3, దర్శిలో 6 నర్సరీలు, కొనకనమిట్లలో 10 నర్సరీలు ఉన్నాయి. రైతులకు పెద్ద మొత్తంలో మిరప నారు అందించారు. జిల్లాలో ఎక్కువగా తేజ, ఆర్మూరు, బ్యాడీ, జీని 26 26, 341 రకాలను రైతులు సాగు చేస్తున్నారు. ఎకరాకు 12 వేల నుంచి 14 వేల మొక్కలు నాటుతున్నారు. రకాన్ని బట్టి మొక్క రూ.1.50 నుంచి రూ.2 వరకు కొనుగోలు చేస్తున్నారు.
తెగుళ్లతో అప్రమత్తంగా ఉండాలి
మిర్చి రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నాం. వాతావరణ మార్పుల ఆధారంగా వచ్చే తెగుళ్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. కొమ్మ ఎండు, కాయకుళ్లు తెగులు కనిపిస్తోంది. ఇది కాండం కుళ్లేలా చేస్తుంది. సకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరిస్తున్నాం. అలాగే తామరపురుగుపై కూడా అప్రమత్తంగా ఉండాలి.
ఎర్ర బంగారంపై ఆశలు రెండేళ్లుగా జిల్లా మిర్చి రైతులకు లాభాలు జిల్లాలో 55,823 ఎకరాల్లో సాగు పశ్చిమ ప్రకాశంలో అత్యధికంగా సాగు తెగుళ్లపై రైతులు అప్రమత్తం ప్రస్తుతం మార్కెట్లోకి పచ్చిమిర్చి
రెండేళ్లుగా మంచి ధరలతో రైతుకు మిర్చి పంట లాభాలు తెచ్చిపెట్టింది. గత నెలలో కురిసిన వర్షాలకు రైతులు కొంత మేర నష్టపోయినా దిగుబడులు, ధరలపై ఆశలు పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 55,823 ఎకరాల్లో సాగు చేశారు. అధిక దిగుబడినిచ్చే రకాలను ఎక్కువగా సాగు చేశారు. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. గత సీజన్ ధరలతో పోల్చుకుంటే ఈసారి కూడా రైతుల పంట పండినట్లే.
వర్షాలకు రూ.3 కోట్ల మేర నష్టం
వాయుగుండం ప్రభావంతో గత నెలలో కురిసిన భారీ వర్షాల ప్రభావం మిర్చి సాగుపై చూపించింది. జిల్లాలో దాదాపు రూ.3 కోట్ల మేర మిర్చి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికార యంత్రాంగం లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా కురిచేడు, చీమకుర్తి, నాగులుప్పలపాడు, మర్రిపూడి, రాచర్ల, అర్థవీడు, బేస్తవారిపేట, కనిగిరి తదితర మండలాల్లో దాదాపు 11 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. పూత దశలోనే దెబ్బతినడంతో మళ్లీ నారు వేసి సాగుచేస్తున్నారు.
– గోపీచంద్, హార్టీకల్చర్ ఏడీ, ఒంగోలు
Comments
Please login to add a commentAdd a comment