ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సర్వం సిద్ధం
ఒంగోలు మెట్రో: ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వివిధ దేవస్థానాల్లో తెల్లవారు జాము నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి ఆయా ఆలయాల నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒంగోలు కొండమీద శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి టికెట్లను ముందస్తుగా జారీ చేసి భక్తులకు అందజేశారు. స్థానిక పీవీఆర్ గరల్స్ హైస్కూల్ గడియారం వారి వీధిలో అనంత కోదండ రామస్వామి మందిరం, మంగమూరు రోడ్డు ఐశ్వర్య నగర్ శ్రీ భగవాన్ మురళీకృష్ణ దేవాలయం, కేశవస్వామి పేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి, కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం, సత్యనారాయణపురం దిబ్బల రోడ్డు రైతుబజార్ దగ్గర అనంత కోదండ రామస్వామి దేవస్థానం, సమతా నగర్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం, గోపాల్ నగరంలోని మురళీకృష్ణ దేవాలయం, బాపూజీ కాంప్లెక్స్, వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఒంగోలు మర్రిచెట్టు కాలనీ పొలిమేర అభయాంజనేయ స్వామి దేవస్థానం, రంగారాయుడు చెరువు దగ్గర శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ నిర్వాహకులు, అధికారులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు
● అవగాహన పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్: జిల్లాలో ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కోడి పందేలు నిషేధమని అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్లను స్థానిక ప్రకాశం భవనంలో గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చట్ట విరుద్ధంగా కోడి పందేలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. గేమింగ్ యాక్టు, జంతు హింస నివారణ చట్టాల మేరకు కోడి పందేలు నిర్వహించడం, పొల్గొనడం కూడా నేరం కిందకే వస్తాయని తెలిపారు. అతిక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. కోడి పందేలు అరికట్టేందుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఆర్‌డీఓ లక్ష్మీపసన్న, పశుసంవర్థకశాఖ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
● ఏపీఎన్‌జీఓ ఉమెన్ వింగ్ ప్రతినిధులు
ఒంగోలు అర్బన్: జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీఎన్‌జీఓ మహిళా వింగ్ కృషి చేస్తోందని జిల్లా మహిళా వింగ్ చైర్‌పర్సన్ కె.కోటేశ్వరమ్మ తెలిపారు. స్థానిక ఎన్‌జీఓ హోంలో గురువారం ఏపీఎన్‌జీఓ మహిళా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పని వాతావరణంలో వేధింపులు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్, రెస్ట్‌రూమ్స్ వంటి సమస్యలపై చర్చించి పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉమెన్ వింగ్ చైర్మన్ నిర్మలాకుమారి, కన్వీనర్ మాది, ఆలిండియా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉమెన్ కన్వీనర్ రాజ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు శరత్‌బాబు, కార్యదర్శి ఆర్‌సీహెచ్ కృష్ణారెడ్డి, శిరీషా, నారాయణమ్మ, రత్నరాణి, శివకుమార్, అంజనాదేవి, ప్రణతి, జయమ్మ, సావిత్రి, శివజ్యోతి, కవిత, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment