రెవెన్యూ సదస్సుల అర్జీలు పరిష్కరించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్:
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీతో రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో అన్ని మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లతో ఒంగోలులోని కలెక్టరేట్‌లో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల నిర్వహణ నేపథ్యం, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇస్తున్న ప్రాధాన్యం గురించి వివరించారు. మండల స్థాయి రెవెన్యూ అధికారులు రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మండల సర్వేయర్లతో తహసీల్దార్లు ప్రత్యేకంగా చర్చించి రెవెన్యూ, రెవెన్యూయేతర సమస్యలకు సంబంధించిన అర్జీలను వేరుపరచాలన్నారు. ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ మేరకు పరిష్కారాలు చేయాలన్నారు. సమస్యల తీవ్రతను బట్టి తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. రెవెన్యూకు సంబంధించి ముఖ్యంగా జాయింట్ ఎల్‌పీఎం, విస్తీర్ణం, సరిహద్దు వివాదాలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆయా సమస్యలను సహేతుకంగా పరిష్కరించి ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు.
క్షేత్రస్థాయిలో పరిష్కరించలేని సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యల పరిష్కారంలో తీసుకోవాల్సిన అంశాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, సర్వే శాఖ ఏడీ గౌస్‌బాష, డీఆర్‌ఓ చిన ఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, ఒంగోలు, కనిగిరి ఆర్‌డీఓలు లక్ష్మీప్రసన్న, కేశవర్థన్‌రెడ్డి, డిప్యూటి కలెక్టర్లు కుమార్, సత్యనారాయణ, వరకుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment