నేడే చివరి అవకాశం
ఒంగోలు టౌన్: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గతేడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు నేటితో ముగియనున్నాయి. మొత్తం పది రోజుల పాటు పరీక్షలు జరిగాయి. గురువారం 9వ రోజు 552 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 365 మంది తదుపరి రాత పరీక్షకు ఎంపికయ్యారు. జిల్లాలో మొత్తం 5,345 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. వారిలో 4,435 మంది పురుష అభ్యర్థులు, 910 మంది మహిళా అభ్యర్థులు ఉండగా, సగం మందే హాజరయ్యారు. 2,411 మంది పురుష అభ్యర్థులు హాజరవగా, 1,733 మంది క్వాలిఫై అయ్యారు. కేవలం 415 మంది మహిళా అభ్యర్థులు హాజరవగా, 237 మంది క్వాలిఫై అయి తదుపరి రాత పరీక్షకు ఎంపికయ్యారు. మొత్తం మీద 2,826 మంది మాత్రమే దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. మిగిలిన వారు వివిధ కారణాల వలన కాల్ లెటర్‌లో ఇచ్చిన తేదీన హాజరుకాలేకపోయారు. అలాంటి వారికి శుక్రవారం చివరి రోజు అవకాశం కల్పించారు. వారంతా జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండుకు వచ్చి అప్పీల్ చేసుకుని ఈవెంట్స్‌లో పాల్గొనాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం జరిగిన ఈవెంట్స్‌లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ సురేష్‌బాబు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, పీటీసీ డీఎస్పీలు మాధవరెడ్డి, లక్ష్మణ్‌కుమార్, డీపీఓ ఏఓ రామ్మోహనరావు, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, డీటీసీ సీఐ షేక్ షమీవుల్లా, పీటీసీ సీఐ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు మనోహర్, రమణారెడ్డి, సీతారామిరెడ్డి, షేక్ ఖాశీం తదితరులు పాల్గొన్నారు.
దేహదారుఢ్య పరీక్షలకు గైర్హాజరైన కానిస్టేబుల్ అభ్యర్థులకు మరో అవకాశం ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ దామోదర్ సూచన
Comments
Please login to add a commentAdd a comment