బీఆర్ నాయుడు నైతిక బాధ్యత వహించాలి
సింగరాయకొండ: తిరుపతిలోని వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన దుర్ఘటనకు నైతిక బాధ్యత వహించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందడంతో పాటు 34 మంది తీవ్ర గాయాలపాలయ్యారని, ఇది కేవలం ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీలో రాజకీయ జోక్యం ఎక్కువైందని, పూర్తిగా సమన్వయ లోపం వలన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా బోర్డు విఫలమైందని విమర్శించారు. బుధవారం జరిగిన దుర్ఘటనే ప్రధాన నిదర్శనమని అన్నారు. కేవలం వీఐపీలు, వీవీఐపీలు, రాజకీయ నాయకుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడంలో నిర్లక్ష్యం వహించారనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని విమర్శించారు. తిరుపతి చరిత్రలో ఇటువంటి దుర్ఘటన ఎన్నడూ జరగలేదన్నారు.
చంద్రబాబు అనాలోచిత చర్యల కారణంగానే భక్తుల మృతి...
ఈ నెల 8వ తేదీ వరకు చంద్రబాబు కుప్పం పర్యటన కారణంగా పోలీసు యంత్రాంగం మొత్తం కుప్పంలోనే ఉందని, చంద్రబాబు అనాలోచిత చర్యల వలనే తిరుపతిలో దుర్ఘటన జరిగిందని ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. ఇది కేవలం ప్రభుత్వ చేతగానితనమని, కూటమికి సిగ్గుచేటని విమర్శించారు. కానీ, ఇది కేవలం దైవ సంకల్పం అంటూ టీటీడీ చైర్మన్ నాయుడు చేతులు దులుపుకునే ప్రయత్నం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. గత టీడీపీ పాలన 2014–19లో కూడా ఇదేవిధంగా టీటీడీలో వీఐపీలు, వీవీఐపీలకు ప్రాధాన్యత ఇచ్చారని, సీఎం రమేష్, సుజనాచౌదరి లాంటి వారు తమ వెంట 50 నుంచి 100 మంది వరకు నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకెళ్లి వైకుంఠ ద్వార దర్శనం చేయించారని సురేష్ గుర్తుచేశారు. ప్రస్తుత దుర్ఘటనలో ఇద్దరుముగ్గురిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం చంద్రబాబుకు తగదన్నారు. చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ దుర్ఘటనపై ఎవరికి వారు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి నిజాలను నిగ్గుతేల్చి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.
టీటీడీ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలి వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment