టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి
● వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు
ఒంగోలు సిటీ: టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని, తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటన ముమ్మాటికీ కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి పాదపద్మాల చెంత తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించడం చాలా బాధాకరమన్నారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరి పాపం.. ఎవరికి శాపమంటూ ప్రశ్నించారు..? మృతుల కుటుంబ సభ్యులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. తిరుమలలో ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూడాలన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు వస్తారని ముందుగానే అంచనా ఉన్నప్పటికీ టీటీడీ పాలకమండలి, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారపార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధుల సేవలో తరిస్తూ సామాన్య భక్తుల మరణాలకు పరోక్షంగా కారణమైన టీటీడీ పాలకమండలి మొత్తాన్ని రద్దు చేయాలని, చైర్మన్ వెంటనే తప్పుకోవాలని రవిబాబు డిమాండ్ చేశారు. టీటీడీ అధికారులుగానీ, పాలకమండలిగానీ ఉత్తుత్తి ప్రచారానికి ఇస్తున్నంత సమయం ఏర్పాట్ల కోసం ఇవ్వడంలేదని ఆరోపించారు. టోకెన్ల జారీ కేంద్రాలకు సంబంధించిన సమాచారం సరిగా లేదని, భక్తుల భద్రత విషయంలో ఏమరుపాటు తగదని హెచ్చరించారు. మృతుల కుటుంబాలను టీటీడీ పూర్తిగా ఆదుకోవాలన్నారు. అలాగే, రానున్న రోజుల్లో ఏ ఒక్క ప్రాణం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీ పాలకమండలి, ప్రభుత్వంపై ఉందన్నారు. దీనిలో ఏమాత్రం అలసత్వం తగదన్నారు. వైకుంఠ ద్వారా దర్శనాలు జరిగినన్ని రోజులు మరింత అప్రమత్తంగా ఉంటూ వీఐపీ తాకిడి తగ్గించి సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment