150 ఎకరాలు
కబ్జా కోరల్లో
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘‘ఎక్కడైనా భూ కబ్జాలకు పాల్పడితే ఆ నా కొ..లను జైల్లో వేయించి బయటకు రాకుండా చేస్తాం’’ అని మార్కాపురం ఎమ్మెల్యే చేసిన హెచ్చరికలను ఆ పార్టీ నేతలు పూచికపుల్లలా తీసిపడేశారు. క్షేత్ర స్థాయిలో టీడీపీ నాయకులు అధికారమే అండగా భూ కబ్జాలతో చెలరేగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదలైన ఈ ఆక్రమణ బాగోతం తర్లుపాడు మండలంలో అప్రతిహతంగా సాగుతోంది. ఇటీవల గానుగపెంట గ్రామ సమీపంలో ఓ టీడీపీ నేత 10 ఎకరాల పశువుల బీడును ఆక్రమించి మామిడి, కొబ్బరి మొక్కలు నాటుకున్న వైనంపై ‘సాక్షి’లో కథనం రావడంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా తర్లుపాడు మండలంలోని బుడ్డపల్లి గ్రామంలో టీడీపీ నేతల భూ దందాపై నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదు అందడం.. విచారణ చేపట్టాలంటూ సీఎంవో నుంచి ఆదేశాలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆక్రమణలు ఇలా..
కేతగుడిపి రెవెన్యూ ఇలాఖాలోని బుడ్డపల్లి గ్రామ పరిధిలో సర్వే నంబరు 112లో 6 ఎకరాలు, 113లో 7.9 ఎకరాలు, 109/1లో 2.76 ఎకరాలు, 109/3లో 5.86, 317లో 65.12, 294లో 11.74, 330లో 12.36, 331లో 10.02, 338లో 11.6 ఎకరాలు, 26/1లో 78 సెంట్లు, 21/1లో 1.25 ఎకరాలు, 117లో 2 ఎకరాలు, 117, 118 సర్వే నంబర్లలో 10 ఎకరాలు.. ఇలా సుమారు 150 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎకరా మార్కెట్ ధర రూ.10 లక్షలుగా లెక్కగట్టినా సుమారు 15 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయింది.
టీడీపీ నేతల పనే..
బుడ్డపల్లి గ్రామ పరిసరాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు దర్జాగా కబ్జా చేశారు. ఈ కబ్జా బాగోతంపై అదే గ్రామానికి చెందిన ఏడుకొండలు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణల డొంక కదిలింది. సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం విచారణ ప్రారంభించారు. మార్కాపురం సబ్‌కలెక్టర్ త్రివినాగ్, తహసీల్దార్ విజయభాస్కర్, ఆర్‌ఐ, వీఆర్‌ఓ తదితరులు ఆక్రమిత భూములను పరిశీలించారు. డాక్యుమెంట్లు ఉన్నాయా అని భూములను స్వాధీనంలో ఉంచుకున్న వారిని ప్రశ్నించగా సరైన సమాధానం లేదు. దీంతో ఆక్రమణదారులు ఖాళీ చేసి వెళ్లాలంటూ సబ్ కలెక్టర్ హెచ్చరించారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా.. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
కూటమి ప్రభుత్వంలో చెలరేగిపోతున్న భూ అక్రమార్కులు ప్రభుత్వ భూములు కనిపిస్తే పాగా చేస్తున్న టీడీపీ నేతలు ఆక్రమిత భూముల మార్కెట్ విలువ రూ.15 కోట్ల పైమాటే.. మండల, జిల్లా స్థాయి దాటి సీఎంవో స్థాయిలో ఫిర్యాదులు ఇటీవల గానుగపెంట వద్ద టీడీపీ నేత ఆక్రమించిన భూమి స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment