దైవదర్శనానికి వెళ్లి వస్తూ.. అనంత లోకాలకు..
కొండపి: పోలేరమ్మ తల్లిని దర్శించుకుని తిరుగుప్రయాంలో ఉన్న ముగ్గురిని కర్రల ట్రాక్టర్ రూపంలో మృత్యువు వెంటాడింది. వారిలో ఇద్దరు విగతజీవులు కాగా మరో యువకుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటన కొండపి సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామానికి చెందిన చిరంజీవి, దుర్గారావు, అద్దంకి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన అమీన్ కలిసి మంగళవారం జరుగుమల్లి మండలంలోని కామేపల్లిలో పోలేరమ్మ తల్లి దర్శనానికి బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉన్న వీరిని కొండపి శివారులోని జేఎల్ కోల్డ్ స్టోరేజ్ సమీపంలో మూగచింతల నుంచి కట్టవారిపాలేనికి కర్రల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరంజీవి(40) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా 108లో కొండపి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొండపి ప్రభుత్వ వైద్యశాలలో దుర్గారావు(35) మృతి చెందాడు. అద్దంకి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన అమీన్ పరిస్థితి విషమించడంతో ఒంగోలులోని జీజీహెచ్‌కు తరలించారు. ఘటన జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమ్‌కుమార్ తెలిపారు.
మార్జిన్ లైట్లు లేకనే..
ఎదురుగా కర్రల లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను చీకట్లో గమనించలేకపోవడంతోనే ద్విచక్ర వాహనదారులు ప్రమాదం బారినపడినట్లు తెలుస్తోంది. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణించే కర్రల లోడ్ ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు లేదా మార్జిన్ లైట్లు ఉండాలి. కానీ అవేవీ లేకపోవడంతోనే ఘోర ప్రమాదం సంభవించిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ లైట్లను డిమ్.. డిప్ చేసినా మార్జిన్ అర్థమై అప్రమత్తమయ్యే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయపడ్డారు.
కర్రల లోడ్ ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి ఒంగోలు జీజీహెచ్‌లో చావుబతుకుల మధ్య మరొకరు.. మృతులది ముండ్లమూరు మండలం శంకరాపురం కామేపల్లి నుంచి స్వగ్రామం వెళ్తుండగా కొండపిలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment