స్థల వివాదంలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

స్థల వివాదంలో ఉద్రిక్తత

Published Wed, Jan 22 2025 12:36 AM | Last Updated on Wed, Jan 22 2025 12:36 AM

స్థల వివాదంలో ఉద్రిక్తత

స్థల వివాదంలో ఉద్రిక్తత

సింగరాయకొండ: వివాదాస్పద దేవదాయ శాఖ స్థలంలో అక్రమ కట్టడాల నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకోవడం ఘర్షణకు దారితీసింది. పోలీసుల రాకతో అది మరింత ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సింగరాయకొండలోని కూరగాయల మార్కెట్‌ సెంటర్‌లో సర్వేనంబర్‌ 605 ఏ2లో సుమారు 16 సెంట్ల భూమిని రంగని పద్మావతితో పాటు మరికొందరు కొనుగోలు చేశారు. ఇందులో తాను కొనుగోలు చేసిన మూడు సెంట్ల స్థలంలో పద్మావతి సిమెంటు రాళ్లతో గోడ కట్టేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికులు ఆ స్థలంలో గోడ కడితే రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుందని, కొంత స్థలం వదిలి కట్టుకోవాలని ఆమెతో వాదులాటకు దిగారు. అయితే పద్మావతి మాత్రం తాను కొనుగోలు చేసిన హక్కుగల స్థలంలోనే గోడ నిర్మిస్తున్నానని, ఒక్క సెంటు కూడా ఆక్రమించుకోలేదని వారికి తేల్చి చెప్పింది. దీంతో ఇరువురి మధ్య వాదులాట జరగటంతో పాటు స్థానికులు ఆ స్థలంలో ఉన్న రేకులను లాగి పడేశారు. దీంతో కొంతసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై బీ మహేంద్ర వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ గోడ కడితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుందని, అంతేకాక మా వాళ్ల మృతదేహాలు తీసుకుని పోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని, గోడ నిర్మాణాన్ని ఆపాలని కొందరు ముస్లింలతో పాటు ఇతర సామాజిక వర్గాల వారు ఎస్సైకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో షేక్‌ వాజిత్‌ ఆలీ అనే వ్యక్తి ఆమె వద్ద డబ్బులు తీసుకుని సహకరిస్తున్నారని ఎస్సై మహేంద్రపై ఆరోపణ చేయటంతో ఆగ్రహించిన ఎస్సై.. అతని చొక్కా పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న ముస్లింలు వాజిత్‌ ఆలీని తీసుకుని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ముస్లింలకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. తాను సామరస్యంగా సమస్య పరిష్కరిద్దామని ప్రయత్నిస్తుంటే ఏ తప్పు చేయకుండా అవినీతి ఆరోపణలు చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేసి వాజిత్‌ఆలీని రోడ్డు పై లాక్కుని వెళ్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తరువాత స్థానికులు బతిమిలాడటంతో అతనిని వదిలేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారిని సీఐ సీహెచ్‌ హజరత్తయ్య పిలిపించి మాట్లాడారు. ఆ సమయంలో తహశీల్దార్‌ టీ రవి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి జగదీష్‌లు కూడా అక్కడే ఉన్నారు. ఆ స్థలంలో కట్టడాలు ఆపాలని తహశీల్దార్‌ టీ రవి సూచించినప్పటికీ పద్మావతి ససేమిరా అంది. తాను డబ్బులు పెట్టి కొనుక్కున్నానని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తానని తెగేసి చెప్పింది. కొంతమంది కావాలని వివాదం సృష్టిస్తున్నారని డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపణ చేసింది. దీనిపై సీఐ హజరత్తయ్య డబ్బులు డిమాండ్‌ చేసిన వారి వివరాలు చెబితే వారిపై కేసులు నమోదు చేస్తానని హామీ ఇచ్చారు. ఈఓ జగదీష్‌ అక్కడ కట్టడాలు ఆపాలని ఉడా నిబంధనలు ప్రకారం రోడ్డుకు కొంత స్థలం వదలాలని.. త్వరలో పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ రోడ్డు ఎంత వెడల్పు ఉండాలో తీర్మానం చేస్తామని చెప్పారు. అప్పటి వరకు ఆపాలని పద్మావతికి సూచించారు. అయితే పద్మావతి మాత్రం దాదాపు నెల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని, గోడ కడతానని.. మీ తీర్మానం ప్రకారం రోడ్డు వెడల్పు ఎంత ఉండాలో నిర్ణయిస్తే అప్పుడు గోడ తొలగిస్తానని చెప్పింది. అంతేకాక ఆ రోడ్డులో ఉన్న ఆక్రమణలు కూడా తొలగించాలని డిమాండ్‌ చేసింది.

ఆలస్యంగా వచ్చిన దేవదాయ శాఖ అధికారి

ఈ వ్యవహారంలో ప్రధానపాత్ర పోషించాల్సిన పాతసింగరాయకొండ వరాహలక్ష్మీ నరశింహస్వామి దేవాలయ కార్యనిర్వహణాధికారి పీ కృష్ణవేణి సీఐ కార్యాలయానికి ఆలస్యంగా వచ్చారు. వాస్తవానికి ఆ స్థలానికి సంబంధించి పూర్తి నిర్ణయాధికారం ఆమెదే. ఆమె తాపీగా వచ్చి సీఐ, ఎస్సైకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈనెల 9వ తేదీ ఒంగోలు దేవదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌ పానకాలరావు, కందుకూరు దేవదాయ ఇన్‌స్పెక్టర్‌ సత్యన్నారాయణ, ఈఓ కృష్ణవేణి వచ్చి మరీ పద్మావతి స్థలంతో పాటు పక్కనున్న 13 సెంట్ల స్థలానికి బోర్డు ఏర్పాటు చేశారు. ఇది దేవదాయ స్థలం... ఇందులో ఎవరు ప్రవేశించినా వారిపై క్రిమినల్‌ కేసులు బనాయిస్తామని బోర్డు లో పేర్కొన్నారు. కానీ తాజాగా కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం బెయిలబుల్‌ సెక్షన్లు మాత్రమే వర్తిస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో దేవదాయ శాఖ అధికారులకు భారీగానే ముట్టాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరికి పద్మావతి ఆ స్థలంలో తను అనుకున్న విధంగా కూలీలతో గోడ నిర్మాణం చేపట్టింది. సాయంత్రానికి ఆ స్థలంలోకి 145 యాక్టు ప్రకారం ఎవరూ ప్రవేశించరాదని తహశీల్దార్‌ టీ రవి ఆదేశాలు జారీ చేశారని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆదేశాలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై మహేంద్ర హెచ్చరించారు. ఈ ఽఘటనపై తహశీల్దార్‌, పంచాయతీ కార్యదర్శి, దేవదాయ ఈఓ ల నుంచి రాతపూర్వక ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. స్థానిక ప్రజలు మాత్రం ఈ స్థలంతో పాటు పక్కనే ఉన్న దేవదాయ స్థలం పై కూడా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌ రవికి వినతిపత్రం అందజేశారు. అయితే కొనుగోలుదారులు మాత్రం తాము లక్షలు పెట్టి స్థలాలు కొనుగోలు చేస్తే అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు వర్గాల మధ్య ఘర్షణ భారీగా గుమికూడిన జనం జనాన్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులు ఎస్సైపై అవినీతి ఆరోపణలు చేసిన స్థానికులు ఆరోపణలు చేసిన వ్యక్తిని స్టేషన్‌కు లాక్కెళ్లిన ఎస్సై వివాదానికి ఆజ్యం పోసిన దేవదాయశాఖ అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement