ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
● సస్పెండ్ చేసి కేసు నమోదు
మద్దిపాడు: మండలంలోని వెల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈఓ కిరణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కురిచేడు మండలం కాటంవారిపాలేనికి చెందిన ఉపాధ్యాయుడు గోపనబోయిన రవికుమార్ మద్దిపాడు మండల పరిధిలోని వెల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలో 2017 ఆగస్టు నుంచి పనిచేస్తున్నాడు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు రావడంతో శనివారం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. తుది నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ కిరణ్‌కుమార్ ఆదివారం మధ్యాహ్నం సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అనంతరం విచారణ అధికారులైన జీసీడీఓ హైమావతి, డీఈఓ కిరణ్‌కుమార్, స్థానిక ఎంఈఓ–2 బి.శ్రీనివాసరావు తమ విచారణలోని ఆధారాలను మద్దిపాడు పోలీస్‌స్టేషన్లో సమర్పించి ఆ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సై బి.శివరామయ్య ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక సమర్పించి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి
త్రిపురాంతకం: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి యువకుడు మృతిచెందిన సంఘటన త్రిపురాంతకం మండలంలోని లేళ్లపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన గుమ్మా వెంకటశ్రీను (22) తన ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్‌ను బంధువులకు అప్పగించేందుకు వెళ్తున్న సమయంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. పనుల నిమిత్తం హైదరాబాదు వెళ్లిన ఆయన.. మూడు రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అందరినీ పలకరిస్తూ సరదాగా ఉండే యువకుడి మృతితో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కుక్కల దాడిలో పది గొర్రెలు మృతి
గిద్దలూరు రూరల్: కుక్కల దాడిలో 10 గొర్రెలు మృతిచెందగా, 4 గొర్రెలు గాయాలపాలైన సంఘటన మండలంలోని తాళ్లపల్లె గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ఎం.చిన్నతిరుమలయ్యకు చెందిన గొర్రెల మందలో శనివారం రాత్రి కుక్కలు చొరబడి గొర్రెలపై దాడికి పాల్పడ్డాయి. ఈ సంఘటనలో 10 గొర్రెలు మృత్యువాతపడగా, మరో 4 గొర్రెలకు గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం గొర్రెలను మేతకు తరలించేందుకు చిన్నతిరుమలయ్య మందలోకి వెళ్లి చూసి గమనించి విలపించాడు. సమాచారం అందుకున్న సంజీవరాయుడుపేట వెటర్నరీ డాక్టర్ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో గాయపడిన గొర్రెలకు చికిత్స చేశారు. చనిపోయిన గొర్రెల విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని గొర్రెల యజమాని కోరాడు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన
కానిస్టేబుల్ మృతి
దొనకొండ: దొనకొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ గత నెలలో గుంటూరు హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి గుంటూరులోనే ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ బాలఉగ్ర ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందారు. మృతదేహాన్ని అతని స్వగ్రామమైన కొమరోలు మండలం పుల్లారెడ్డిపల్లి తీసుకెళ్లారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తోటి పోలీసు సిబ్బంది, అధికారులు వెళ్లి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment