అధికారుల నిర్లక్ష్యానికి వృద్ధుడు మృతి
సింగరాయకొండ: ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని కందుకూరు ఫ్‌లై ఓవర్ నుంచి ఊళ్లపాలెం కటింగ్ రోడ్డు వరకు వేములపాడు–ఊళ్లపాలెం రోడ్డు పనులను నెలరోజుల క్రితం చేపట్టారు. అందులో భాగంగా శ్రీరాంనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమీపంలో కల్వర్టు నిర్మాణానికి గుంతలు తీశారు. పనులు ప్రారంభించి నెలరోజులకుపైగా అయినప్పటికీ నత్తనడకన జరుగుతున్నాయి. ఈ కల్వర్టు వద్ద ఎటువంటి హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న తన్నీరు కొండురత్నం (65) ప్రమాదవశాత్తూ కల్వర్టు నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి మరణించాడు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కల్వర్టు నిర్మాణానికి తీసిన గుంతలో
పడి మరణించిన వైనం
Comments
Please login to add a commentAdd a comment