న్యాయం చేయకుంటే ఆత్మహత్యే..!
సింగరాయకొండ: తన స్థలానికి న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని, ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలంటూ సింగరాయకొండలోని స్థల యజమాని రంగని పద్మావతి ఆదివారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాధికారులను కోరారు. స్థానిక కూరగాయల మార్కెట్ సెంటర్‌లోని పెద్ద మసీదు బజారు మొదట్లో 3 సెంట్ల స్థలాన్ని రూ.50 లక్షలకు కొనుగోలు చేశానని, ఆ స్థలంలో గోడలు నిర్మిస్తే ఆదివారం తెల్లవారుజామున కొంతమంది కూల్చివేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ పద్మావతి ఆదివారం ఉదయం తన స్థలం వద్ద టెంటు వేసి నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నెలరోజులుగా కొంతమంది తనను కావాలని ఇబ్బంది పెడుతున్నారని, చివరికి తన స్థలంలో గోడలు కట్టుకుంటే రాత్రికిరాత్రే కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతివ్వాలని ప్రభుత్వ అధికారులను కోరారు. ఆమె నిరాహారదీక్ష చేస్తుండగా స్పృహ తప్పి పడిపోవటంతో వెంటనే కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. సైలెన్ కట్టించుకుని వచ్చి మళ్లీ ధర్నాకు కూర్చుని సోషల్ మీడియా ద్వారా పద్మావతి చేసిన అభ్యర్థన వైరల్ అవడంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పందించారు. వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఒంగోలు జీజీహెచ్‌కి తరలించిన తహసీల్దార్...
కలెక్టర్ ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న సింగరాయకొండ తహసీల్దార్ టి.రవి నిరాహారదీక్ష చేస్తున్న పద్మావతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. సంఘటన స్థలంలో ఎటువంటి గొడవలు జరగకుండా ఆమె స్నేహితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పద్మావతి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించి స్థలానికి కొలతలు వేశారు. రికార్డుల ప్రకారం ఆమెకు 2.66 సెంట్లు మాత్రమే ఉండగా, 4 సెంట్ల స్థలంలో నిర్మాణాలు ఉన్నాయని, దీని వలన మంచినీటి పైపులైనుకు ఇబ్బంది ఉందని, అదనంగా ఉన్న 1.34 సెంట్ల స్థలంలోని కట్టడాలను తొలగించాలని ఆదేశించడంతో పంచాయతీ సిబ్బంది జేసీబీతో తొలగించారు. ఆ స్థలంలో 145 సెక్షన్ కూడా అతిక్రమించారని తెలిపారు. బాధితురాలు మాత్రం తాము ఆక్రమించుకోలేదని, తమ స్థలంలోనే కట్టుకున్నామని, కొంతమంది దౌర్జన్యంగా గోడలు, రేకులు కూల్చివేసినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment